
వచ్చే రెండురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు
ఇప్పటికే పొంగి ప్రవహిస్తున్న గోదావరి, కృష్ణా, మూసీ నదులు
ఏకమైన వాగులు, వంకలు.. నిండుకుండల్లా చెరువులు
చాలాచోట్ల నీట మునిగిన వరి, పత్తి, మిర్చి పంటలు
హైదరాబాద్‌లో శుక్రవారం ఎడతెరిపి లేకుండా వర్షం
వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో ముగ్గురు మృతి
నైరుతిలో సగటు కంటే 31% అధిక వర్షపాతం
మూడు రోజుల్లో ముగియనున్న నైరుతి సీజన్
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రంలో వచ్చే రెండురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటించింది. 27 నుంచి 29వ తేదీ వరకు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వద్యాలయంలోని వ్యవసాయ వాతావరణ పరిశోధనా కేంద్రం అధిపతి డాక్టర్ పి.లీలారాణి శుక్రవారం తెలిపారు.
శనివారం వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
28న నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అన్ని జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
29న ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 30, అక్టోబర్ 1 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల (గంటకు 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆమె వెల్లడించారు.

పొంగుతున్న వాగులు, నదులు
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చాలాచోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోదావరి, కృష్ణా, మూసీ తదితర నదుల ఉధృతి పెరుగుతోంది. హైదరాబాద్ నగరంలోనూ శుక్రవారం రోజంతా భారీ వర్షం కురిసింది. వాయువ్య మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల సీజన్‌లో శుక్రవారం నాటికి రాష్ట్రంలో సగటున 72.33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 95.06 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
సాధారణం కంటే 31% అధిక వర్షపాతం నమోదైంది. సీజన్ మొత్తంలో మెదక్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, నాగర్‌కర్నూల్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా.. మరో 17 జిల్లాల్లో అధికం, 10 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. మరో మూడు రోజుల్లో నైరుతి సీజన్ ముగియనుంది.
పుల్కల్‌లో 14.6 సెంటీమీటర్ల వర్షం
సంగారెడ్డి జిల్లా పుల్కల్‌లో శుక్రవారం అత్యధికంగా 14.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు నీట మునగటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముంబై హైవేపై ముత్తంగి నుంచి సంగారెడ్డి వరకు రోడ్డుకు ఇరువైపుల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పుల్కల్, వట్‌పల్లి, మునిపల్లి, రాయికోడ్ మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండలంలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పత్తి, వరి పంటలు నీట మునిగాయి. భారీ వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాలుస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం శుక్రవారం మధ్యాహా్ననికి 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు 45.10 అడుగుల వద్ద ప్రవహిస్తోంది.
ములుగు జిల్లాలో భారీ వర్షాలకు బాడువా ప్రాంతంలో మిర్చి పంట నీట మునిగింది. టేకులగూడెం సమీపంలో 163 నంబర్ జాతీయ రహదారిని గోదావరి వరద ముంచెత్తటంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కాళేశ్వరం త్రివేణీ సంగమం వద్ద 11.410 మీటర్ల ఎత్తులో నీటిమట్టం పుష్క ర ఘాట్‌ను తాకుతూ ప్రవహిస్తోంది. మేడిగడ్డ బరా జ్‌కు 8.35 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. బరాజ్ మొత్తం 85 గేట్లు ఎత్తి వరద మొత్తాన్ని దిగువకు వదులుతున్నారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి మూసీ, ఈసీ, కాగ్నా నదులు ఉప్పొంగాయి. కోట్‌పల్లి, జుంటుపల్లి ప్రాజెక్టులు అలుగుపారాయి.
ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా శుక్రవారం మొత్తం ఏకధాటికి వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో 5.68 సెంటీమీటర్లు, పెద్దకొత్తపల్లిలో 5.63 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 500 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, వరి పంటలు దెబ్బతిన్నాయి.
వేర్వేరు చోట్ల ముగ్గురు మృతి
భారీ వర్షాలకు శుక్రవారం రాష్ట్రంలో ముగ్గురు మృతిచెందారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం బెగుళూర్ గ్రామంలో మంద లక్ష్మి (42) అనే మహిళ ఇంటి గోడకూలి మరణించారు. రంగారెడ్డి జిల్లా జిల్లేడ్ చౌదరిగూడ మండలం గుర్రపల్లికి చెందిన ఎన్కెపల్లి సత్తయ్య (60) వాగు దాటుతుండగా గల్లంతయ్యాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టగా ఓచెట్టుకు చిక్కుకున్న స్థితిలో మృతదేహం లభ్యమైంది.
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జనకాపూర్ గ్రామానికి చెందిన పవార్ బిక్కునాయక్ (78)కు ఛాతీలో నొప్పి రావటంతో కెరమెరిలోని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయతి్నంచగా, అనార్‌పల్లి వాగు ఉప్పొంగటంతో వాహనంలో తరలించేందుకు వీలు కాలేదు. దీంతో ఆయన మార్గమధ్యలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వాగుపై వంతెన ఉంటే ప్రాణాలు దక్కేవని ఆవేదన వ్యక్తం చేశారు. కెరమెరి మండలం కరంజీవాడ గ్రామానికి చెందిన మండాడి కోసు (60) కూడా వాగు ప్రవాహంతో ఆస్పత్రికి వెళ్లలేక ఇంట్లోనే ఉండిపోవడంతో ఈ నెల 21న మృతిచెందాడు.