
భారీ వర్షానికి నీటమునిగిన వరంగల్‌లోని ప్రధాన రహదారి
3 రోజులు ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు భారీ వర్షసూచన నేపథ్యంలో సీఎం ఆదేశాలు
స్కూళ్లు, కాలేజీలకు సెలవులపై కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలి..
ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేలా చూడాలి
క్లౌడ్ బరస్ట్‌ను సైతం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.. ఎక్కడా ప్రాణ,ఆస్తి నష్టం జరగడానికి వీల్లేదు
హెలికాప్టర్లు, అంబులెన్సులు,మందులు అందుబాటులో ఉంచాలి
హైదరాబాద్‌లో హైడ్రా అప్రమత్తంగా ఉండాలి.. టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయాలి
వరద ముంపు బాధితుల ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి.. ఉన్నతాధికారులు, కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. మూడు రోజుల పాటు అధికారులు, ఉద్యోగులు, ఇతర సిబ్బంది సెలవులను రద్దు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ మేరకు అధికారులను ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆన్‌డ్యూటీలో ఉండాలన్నారు.
హైదరాబాద్‌తో పాటు వరద ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. వరద ముంపు పరిస్థితుల్లో ట్రాఫిక్ సమస్యను నివారించడానికి శాంతిభద్రతల విభాగం పోలీసుల సేవలను కూడా వినియోగించుకోవాలని చెప్పారు.
రాబోయే 72 గంటలు అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండి సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ం నిర్వహించారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
కాజ్‌వేలు, వంతెనలపై రాకపోకలు ఆపండి
‘లోతట్టు కాజ్‌వేలు, ఉధృతంగా ప్రవహించే నదులు, వాగులు, వంకల వంతెనలపై నుంచి రాకపోకలు లేకుండా చూడాలి. పశువులు, గొర్రెలు, మేకల కాపర్లు తరచూ వాగుల్లో చిక్కుకుపోతున్నారు. వారిని అప్రమత్తం చేయాలి. ఎక్కడైనా ప్రమాదవశాత్తు చిక్కుకుంటే వారిని తక్షణమే బయటకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలి. విద్యుత్ శాఖ అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలి. మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్లు, జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలి.
డ్రైనేజ్ వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. గతంలో ఖమ్మంలో 2 గంటల్లో 42 సెం.మీ వర్షం పడింది. అలాంటి పరిస్థితులను కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. మన దగ్గర 24 గంటల్లో 2 సెం.మీ వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణాలు నిర్మాణం అయ్యాయి. కాబట్టి ఒకటీ రెండు గంటల్లోనే 20, 30 సెంటీమీటర్ల వర్షం (క్లౌడ్ బరస్ట్) పడితే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి.
అలాంటి పరిస్థితులను కూడా ఎదుర్కొనేలా సన్నద్ధం కావాలి. అత్యధిక స్థాయిలో వర్షాలు పడే జిల్లాలు ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలి. ఆయా జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించాలి. సహాయక చర్యలకు అవసరమైన నిధులు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది..’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
నీటి విడుదలపై అలర్ట్ చేయాలి..
‘అకస్మిక వరదలు సంభవించినపుడు ఎయిర్ లిఫ్టింగ్ చేసేందుకు అవసరమైన హెలికాప్టర్లు ఉండేలా చూసుకోవాలి. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో అవసరమైన మందులు ఉంచాలి. గర్భిణులను తక్షణమే తరలించేలా అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచాలి. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలి. అవసరమైతే పాఠశాలలు, కళాశాలలకు సెలవు ఇవ్వడంపై జిల్లా కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలి.
ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేసేలా చర్యలు తీసుకోవాలి. ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లోకి ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లోపై నీటిపారుదల శాఖ పూర్తి అవగాహనతో ఉండాలి. ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలపై పూర్తి సమాచారం లోతట్టు ప్రాంతాల ప్రజలకు తెలియజేయాలి. చెరువులు, కుంటలు కట్టలు తెగే ప్రమాదం ఉన్నందున ముందు జాగ్రత్తలు తీసుకోవాలి..’ అని రేవంత్ ఆదేశించారు.
జిల్లాలు కమాండ్ కంట్రోల్‌తో టచ్‌లో ఉండాలి..
‘భారీ వర్షాల సమయంలో ప్రజలు బయటకు రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. అన్ని జిల్లాలను కమాండ్ కంట్రోల్‌తో అనుసంధానం చేయాలి. వారికి ఎప్పటికప్పుడు అలర్ట్ సమాచారం ఇవ్వాలి. డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌తో వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా అందరూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.
వర్షాలు, వరదల పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఎఫ్‌ఎం రేడియోలలో అలర్ట్ చేయాలి. సాధ్యమైనంత వరకు రోడ్లపై ట్రాఫిక్ తక్కువగా ఉండేలా చూడాలి. మీడియా తప్పుడు వార్తలతో భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేయొద్దు. సమాచార శాఖ మీడియాకు సరైన సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలి..’ అని సీఎం సూచించారు.
అన్ని విభాగాలూ సమన్వయంతో పని చేయాలి
‘హైదరాబాద్‌లో వరదలపై హైడ్రా అప్రమత్తంగా వ్యవహరించాలి. 24 గంటలూ అందుబాటులో ఉండాలి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు సమన్వయంతో పని చేయాలి. జీహెచ్‌ఎంసీ, హైడ్రా, పోలీస్, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సిబ్బంది.. ప్రతి విభాగం సమన్వయంతో పని చేయాలి. అత్యవసర సమయాల్లో ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయాలి. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి..’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.