
25 నుంచి కోస్తా, ఉత్తరాంధ్రలో...విస్తారంగా వర్షాలు
సాక్షి, విశాఖపట్నం/ఒంగోలు సిటీ/మహానంది: తూర్పు మధ్య, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో 25వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ.. 26వ తేదీన దక్షిణ ఒడిశా–ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే సూచనలున్నాయి. అనంతరం ఇది స్థిరంగా కొనసాగుతూ 27న దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర మధ్య తీరందాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో 25వ తేదీ నుంచి కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఉత్తరాంధ్రలో 25 నుంచి 27వ తేదీ వరకూ విస్తారంగా వర్షాలు కురుస్తాయి. మరోవైపు.. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకూ కొనసాగుతోంది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు, పలు చోట్ల తేలికపాటి వానలు కురుస్తాయి.
తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. కాగా, ప్రకాశం జిల్లాలో శనివారం రాత్రి, ఆదివారం భారీ వర్షం కురిసింది. నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వరా్షలతో గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గిద్దలూరు మండలం దిగువమెట్ట వద్ద సగిలేరు, అర్థవీడు, కంభం మండలాల్లో జంపలేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.
మహానంది జలదిగ్బంధం
కర్నూలు జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలపాటు భారీ వర్షం కురిసింది. మహానంది ఆలయంలోని రాజగోపురం ముందు కుడివైపు ఉన్న చిన్న గేటు వరకు వర్షం నీరు ప్రవహించడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. లోపల ఉన్న బ్రహ్మగుండం, విష్ణుగుండం రెండు చిన్న కోనేరుల్లో భారీగా వర్షం నీరు చేరింది. ఆదివారం మధ్యాహ్నం వరకు పరిస్థితి అలాగే కొనసాగింది. మహానంది సమీపంలోని ఎంసీ ఫారం గ్రామంలోని వ్యవసాయ కళాశాల, శ్రీ వేంకటేశ్వర ఒంగోలు జాతి పశు పరిశోధనా స్థానం, ఉద్యాన పరిశోధనా స్థానాలు జలమయమయ్యాయి.

పశు పరిశోధన కేంద్రం చుట్టూ నీరు ఉండటంతో బయటకి రాలేక ఒంగోలు జాతి ఆవులు చేసిన ఆర్తనాదాలు స్థానికులను కలచివేశాయి. వ్యవసాయ కళాశాల హాస్టల్ ప్రాంగణంలోనూ వర్షం నీరు చేరడంతో విద్యర్థులు ఆందోళన చెందారు. గాజులపల్లె రైల్వేస్టేషన్‌లోకి నీళ్లు రావడంతో గిరిజనులు అవస్థలు పడ్డారు. మహానంది–గాజులపల్లె మార్గంలోని ఎంసీ ఫారం వద్ద ఉన్న పాలేరు వాగు పొంగి రోడ్డుపై సుమారు పది అడుగుల ఎత్తులో ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
‘పశ్చిమ’లో పంటలకు నష్టం
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం, ఉండి, వీరవాసరం, పాలకొల్లు, ఆకివీడు మండలాల్లోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాడేపల్లిగూడెం మండలంలో వరి చేలు నేలవాలాయి. ఎల్.అగ్రహారం, కొండ్రుప్రోలు రహదారిలో కోతలు పూర్తయి నెట్టులు కట్టిన ధాన్యం బస్తాలు, రాశులుగా పోసిన ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన చెందారు. పంటను కాపాడుకునేందుకు కష్టాలు పడ్డారు.