నేడు వాయుగుండంగా మారే అవకాశం
సాక్షి, అమరావతి: దక్షిణ అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం బలపడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది తీవ్ర అల్పపీడనంగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ సోమవారానికి ఆగ్నేయ బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది.
ఆ తర్వాత 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం నాటికి నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
వీటి ప్రభావంతో సోమవారం ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.


