విజయవాడలోని ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట ఆ పత్రిక ప్రతులను దహనం చేçస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకలు
తాడేపల్లి, విశాఖ, ఒంగోలులో పోలీసులకు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
మాజీ సీఎం వైఎస్ జగన్‌పై అదే పనిగా వ్యక్తిత్వ హననం
రాజధానిలో రైతుల ఇక్కట్లు ప్రస్తావిస్తే విషం కక్కడం దారుణం
జగన్ అనని మాటలు అన్నట్లు వక్రీకరణ.. దు్రష్పచారం
ప్రభుత్వం తరఫున వకాల్తా పుచ్చుకుని దుర్భాషలు
ఇది జర్నలిజం విలువలను మంటగలపడమే
సాక్షి, అమరావతి/తాడేపల్లి రూరల్ /అల్లిపురం/ఒంగోలు టౌన్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై రోజూ అభ్యంతరకరమైన రాతలు రాస్తూ, వక్రీకృత వ్యాఖ్యలు చేస్తూ, కేవలం విమర్శల కోసమే డిబేట్లు నిర్వహిస్తున్న ఏబీఎన్ టీవీ, ఆంధ్రజ్యోతి అదేపనిగా ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయని వైఎస్సార్‌సీపీ ఆక్షేపించింది. ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ శనివారం పలు ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, పార్టీ గ్రీవెన్స్ సెల్ ప్రెసిడెంట్ అంకంరెడ్డి నారాయణ మూర్తి తదితరులు శనివారం తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో తగిన ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.
ఇదే విషయమై వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే, దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్, పశ్చిమ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్, గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి, అనుబంధ సంఘాల చైర్మన్లు, నాయకులతో కలిసి విశాఖ నగర పోలీస్ కమిషనరేట్‌లో అడ్మిన్, ఏడీసీపీ డాక్టర్ వి.బి.రాజ్‌కమల్‌కు ఫిర్యాదు అందజేశారు. ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్లో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు.. వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, పార్టీ నగర అధ్యక్షుడు కటారి శంకర్‌తో కలిసి ఫిర్యాదు చేశారు. కేబుల్ టీవీ నెట్‌వర్క్ చట్టం, ఐపీసీ నిబంధనల ప్రకారం యాంకర్, యాజమాన్యం రాధాకృష్ణ, చర్చలో పాల్గొని విషం చిమ్మిన విశ్లేషకుల మీద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు
ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో పాటు జర్నలిస్టు వెంకటకృష్ణ పైనా పోలీసులకు ఫిర్యాదు చేశాం. రెండు రోజుల క్రితం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతల, భోగాపురం ఎయిర్‌పోర్టు, పరిశ్రమలు, రాజధాని ప్రాంత రైతుల సమస్యలపై స్పష్టంగా వివరించారు. అయితే ఆ వ్యాఖ్యలను కావాలనే వక్రీకరిస్తూ, జగన్ అనని మాటలు అన్నట్లు చూపించడం ద్వారా ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు. రాజధాని విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జగన్ ప్రస్తావిస్తే, దాన్ని పూర్తిగా ఏబీఎన్, ఆంధ్రజ్యోతి వక్రీకరించాయి. ఇది జర్నలిజం విలువలకు పూర్తిగా పాతరేయడమే.
– కొమ్మూరి కనకారావు, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్,
– అంకంరెడ్డి నారాయణమూర్తి, వైఎస్సార్‌సీపీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు
ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతులు దహనం
రామవరప్పాడు: విజయవాడ రూరల్ రామవరప్పాడు ఫ్లైఓవర్ సమీపంలోని ఆంధ్రజ్యోతి కార్యాలయం ప్రధాన గేట్ వద్ద శనివారం వైఎస్సార్‌సీపీ నాయకులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ వాఖ్యలను వక్రీకరించి, రాష్ట్ర ప్రజలను తప్పు దోవ పట్టిస్తోందని మండిపడ్డారు. ఏబీఎన్ డిబేట్లో, ఆంధ్రజ్యోతి పత్రికలో వైఎస్ జగన్‌పై విషం కక్కడాన్ని ఖండిస్తూ నినాదాలు చేశారు. ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతులను దహనం చేశారు.


