ప్రభుత్వ వైఖరికి నిరసనగా గుంటూరులో ఉపాధ్యాయుల భారీ ర్యాలీ
సంక్రాంతిలోపు 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించాలి
యూటీఎఫ్ రాష్ట్ర నాయకత్వం
గుంటూరు ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆరి్థక ప్రయోజనం చేకూర్చే విధంగా సంక్రాంతిలోపు 12వ వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ)ను నియమించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నక్కా వెంకటేశ్వర్లు, కేఎస్‌ఎస్ ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఈనెల 20 నుంచి ఉద్యమానికి దిగుతామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 51వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలను శనివారం గుంటూరులోని ఏసీ కళాశాలలో నిర్వహించారు.
ఈసందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యూటీఎఫ్ కార్యకర్తలుగా మన ఊరుబడిని కాపాడుకుందామని.. అప్పుడే పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్‌ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ఉపాధ్యాయులపై విద్యాశాఖ కమిషనర్ వ్యవహరిస్తున్న అధికార దర్పం, వ్యవహార శైలి మార్చుకోవాలని, బోధన కంటే బోధనేతర కార్యక్రమాలు ఎక్కువ కావడం వల్ల నాణ్యమైన విద్య అందించడంపై శ్రద్ధ వహించలేకపోతున్నారని అన్నారు.
విద్యారంగంలోనూ పీపీపీపై ఆగ్రహం
పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పీపీపీ విధానాన్ని మెడికల్ కళాశాలలతో పాటు విద్యారంగంలోనూ ప్రవేశపెట్టాలని చూస్తున్నారని, దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. కార్పొరేట్లకు విద్యారంగాన్ని దోచిపెట్టడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు గుంటూరు నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. 12వ పీఆర్సీ కమిషన్ నియమించడంలో వైఫల్యంతో పాటు ప్రభుత్వ విధానాలతో సర్కారు బడుల నిర్వీర్యం, ఉపాధ్యాయులపై మోయలేని పనిభారం తదితర అంశాలకు నిరసనగా వందలాది టీచర్లు ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్సీలు ఐ.వెంకటేశ్వరరావు, కేఎస్ లక్ష్మణరావు, యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


