
నేడు ఉపరితల ఆవర్తనం
రేపు ఉత్తరాంధ్ర సమీపంలో అల్పపీడనం
నేడు, రేపు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో వానలు
సాక్షి, విశాఖపట్నం, సాక్షి అమరావతి: ఉష్ణ మండల తుపాను కారణంగా.. ఉత్తర కోస్తాకు సమీపంలో బుధవారం ఏర్పడాల్సిన అల్పపీడనం కాస్తా ఆలస్యమైంది. పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా.. గురువారం ఉత్తర బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో శుక్రవారం నాటికి ఉత్తరాంధ్రకు సమీపంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం రెండూ ఉత్తర కోస్తాకు సమీపంలోనే కొనసాగుతూ.. క్రమంగా ఒడిశా వైపుగా కదలనున్నాయి. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాల్లో విస్తారంగా మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. అదేవిధంగా.. రాయలసీమలో అక్కడక్కడా మోస్తరు వానలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ముఖ్యంగా గురు, శుక్రవారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖార్ జైన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

పిడుగులతో కూడిన వర్షాలు నేపథ్యంలో చెట్లు, టవర్స్, పోల్స్ కింద, బహిరంగ ప్రదేశాల్లో నిలబడరాదని సూచించారు. తీరం వెంబడి గంటకు 50 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గడచిన 24 గంటల్లో కంచిలిలో 71 మి.మీ., నరసన్నపేటలో 65, కోటబొమ్మాళిలో 55, మందసలో 50, కవిటి రాజపురంలో 48, ఇచ్ఛాపురంలో 43, వజ్రపుకొత్తూరులో 42, పలాసలో 40, సీతంపేటలో 39 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.