
గురువారం భారీ వర్షానికి జలమయమైన మెదక్ పట్టణంలోని ఓ ప్రాంతం
రాష్ట్రంలో పలుప్రాంతాల్లో భారీ వర్షం
మెదక్‌లో అత్యధికంగా 17.6 సెం.మీ వర్షపాతం
హైదరాబాద్–విజయవాడ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్
సాక్షి, హైదరాబాద్/మెదక్ మున్సిపాలిటీ/తాండూరు రూరల్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు దంచికొట్టాయి. హైదరాబాద్‌తోపాటు మెదక్, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాల్లో భారీగా వర్షం కురిసింది. మెదక్‌లో గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏకధాటిగా 3 గంటలపాటు కుండపోత వాన కురిసింది. దీంతో మెదక్ పట్టణం అతలాకుతలమైంది. జిల్లా కేంద్రంలో అత్యధికంగా 17.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
రోడ్లన్నీ చెరువులను తలపించగా, పట్టణంలోని పలువురి ఇళ్లలోకి నీరు చేరింది. పట్టణంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రాంగణం వర్షపు నీటితో నిండిపోవడంతో విద్యా ర్థులు అవస్థలు పడ్డారు. మెదక్ మండలంలోని పలు గ్రామాల్లో 13 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
రాజధానిలో...
హైదరాబాద్‌లో ఉదయం ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదంగా కన్పించిన వాతావరణం మధ్యాహ్నం మూడు తర్వాత ఆకాశంలో ఒక్కసారిగా దట్టంగా మబ్బులు కమ్ముకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షం కురిసింది. హయత్‌నగర్‌లో 11.2 సెం.మీ., డిఫెన్స్ కాలనీ కమాన్ వద్ద 10.2 సెం.మీ, వర్షపాతం నమోదైంది.
హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపైకి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. రోడ్దుపై నాలుగు అడుగుల ఎత్తు మేర వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఎల్బీనగర్ నుంచి మెహిదీపట్నం వరకు ఉన్న ఇన్నర్ రింగ్‌రోడ్డు సహా ఇతర మార్గాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర విఘాతం ఏర్పడింది.
వాగులో ఒకరి గల్లంతు
వాగు దాటుతుండగా ఓ వ్యక్తి గల్లంతైన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సంగెంకలాన్‌లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన భుక్తంపల్లి మొగులప్ప(40) ఆవుల కాపరిగా పని చేస్తున్నాడు. గురువారం అతను ఊరి శివారులోని చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలో వృథాగా పడేసిన టార్ఫాలిన్, ప్లాస్టిక్ కవర్ల కోసం దిడ్డివాగు దాటి వెళ్లాడు.
ఎగువ ప్రాంతంలో కరిసిన వర్షానికి వరద ఉధృతమైంది. అవతలి ఒడ్డున ఉన్న గ్రామస్తులు వద్దని వారిస్తున్నా వినకుండా కవర్ల మూటను నెత్తిపై పెట్టుకుని వాగు దాటుతూ కొట్టుకుపోయాడు. అతని భార్య లలితమ్మ, ఇద్దరు కొడుకులు అక్కడికి చేరుకుని కన్నీటిపర్యంతమయ్యారు. మొగులప్ప ఆచూకీ కోసం చేపట్టిన సహాయక చర్యలకు వర్షం ఆటంకం కలిగించింది.
రెండ్రోజులు మోస్తరు వర్షాలు
రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర సమీపంలో కొనసాగుతున్న ఉపరితల చక్రవాత ఆవర్తనం గురువారం కూడా కొనసాగింది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 4.5 కి.మీ. ఎత్తువరకు కొనసాగుతోంది. మరో ద్రోణి సబ్ హిమాలయన్ పశ్చిమబెంగాల్, సిక్కిం ప్రాంతం నుంచి జార్ఖండ్, దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది.
వీటి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ వివరించింది. ప్రస్తుత నైరుతి సీజన్‌లో ఇప్పటివరకు సగటున 64.05 సెం.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... 78.52 సెం.మీ. నమోదైంది.