
మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ
ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవొచ్చని అంచనా
కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సగటున 2.53 సెం. మీ. వర్షపాతం నమోదైంది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతంలో గురువారం ఉదయం ఉపరితల ఆవర్తనం విలీనమైంది. దీంతో వచ్చే రెండు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేసింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదవుతాయని తెలిపింది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగామ, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో గంటకు 30–40 కి.మీ. వేగంతో కూడిన ఈదురుగాలులతో భారీ వర్షాలు నమోదు కావొచ్చని వివరించింది.
ఈ మేరకు రెండు రోజులపాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 3–6 డిగ్రీల సెల్సియస్ మేర తక్కువగా నమోదవుతున్నాయి. గురువారం నల్లగొండలో 28.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలి: సీఎం
భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం... గురువారం సీఎంఓ అధికారులతో మాట్లాడారు. భారీ వర్షాలు నమోదైన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. వరద ఉధృతి ఉన్న ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు.
భారీ వర్షసూచన ఉన్న జిల్లాల్లో కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని.. ప్రతి విభాగం అధికారితో కలెక్టర్లు నేరుగా మాట్లాడాలని చెప్పారు. భారీ వర్షాలు, వరదల వల్ల ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలు, వరదలను ఎదుర్కొనేందుకు అవసరమైన సహాయక చర్యలకు అధికారులు సిద్ధంగా ఉండాలని.. జిల్లా అధికారులు జిల్లా కేంద్రంలోనే అందుబాటులో ఉండాలన్నారు