
సాక్షి, అమరావతి/వాకాడు: వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఉత్తర ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది. 24 గంటల్లో ఇది పశ్చిమ, వాయవ్య దిశగా ఉత్తర ఒడిశా, దానిని ఆనుకుని ఉన్న జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ వైపు కదిలేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయంది. బుధవారం అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో 5. 4 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది.
విశాఖ జిల్లా గాజువాకలో 5.3, అనకాపల్లి జిల్లా వేంపాడులో 4.4, విశాఖ జిల్లా నాతయ్యపాలెంలో 4.4, విజయనగరం జిల్లా మెరకముడిదంలో 3.6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అల్పపీడనం ప్రభావంతో గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
సముద్ర తీరంలో అలల ఉధృతి..
అల్పపీడనం బలపడటంతో తిరుపతి జిల్లా వాకాడు మండలం తూపిలిపాళెం సముద్ర తీరంలో అలల ఉధృతి అధికమైంది. ఒక్కో సమయంలో సముద్రం నిశ్చలంగా, ఒక్కోసారి అలలు 7 మీటర్ల ఎత్తుకు ఎగసి పడుతున్నాయి. సాధారణంగా అల్పపీడనం సమయంలో సముద్రంలో అలలు ఎక్కువగా ఉండడంతోపాటు తీరం దాటే వరకు నిరంతరం కెరటాలు ఎగసి పడుతుంటాయి.
ఈసారి అలా కాకుండా సముద్రం గంట గంటకు మార్పు చెందుతూ భయబ్రాంతులకు గురిచేస్తోంది. ప్రస్తుతం వినాయక విగ్రహ నిమజ్జనాల పర్వం తూపిలిపాళెం సముద్ర తీరంలో కొనసాగుతోంది. అలలు లేని సమయం కోసం భక్తులు ఎదురు చూసి నిమజ్జనం చేస్తున్నారు. వాకాడు పోలీసులతోపాటు దుగ్గరాజపట్నం మెరైన్ పోలీసులు భక్తులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. మత్స్యకారులు వేట నిలిపివేశారు.