
జూలై నెల వర్షపాతం అంచనాలను విడుదల చేసిన ఐఎండీ
జూన్ నెలలో 20 శాతం లోటు వర్షపాతం..ఐదేళ్లలో ఇదే తొలిసారి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానలు జోరందుకున్నాయి. గత నెలలో వర్షాభావ పరిస్థితులు చోటు చేసుకోగా, ఈ నెలలో మాత్రం పరిస్థితులు ఆశాజనకంగా ఉండనున్నాయి. నైరుతి రుతుపవనాల కదలికలు చురుకుగా ఉండటంతో ప్రస్తుతం వానలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. జూలై నెలలో వర్షాలు సాధారణం కంటే అధికంగా కురిసే అవకాశమున్నట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ మేరకు జూలై నెల వర్షాల అంచనాలను బుధవారం విడుదల చేసింది.
ఈ నెలలో 22.74 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే... సాధారణం కంటే కనీసం 6 శాతం అధిక వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ నెలలో రెండోతేదీ నాటికి సాధారణ వర్షపాతంలో 10 శాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వివరించింది. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో న్యూట్రల్ ఎల్‌నినో–దక్షిణ ఓసిలేషన్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. సీజన్ ముగిసే వరకు ఇలాంటి పరిస్థితులే ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో దక్షిణ భారత దేశంలోని రాష్ట్రాల్లో వర్షపాతం తక్కువగా నమోదు కావొచ్చని, కానీ తెలంగాణలో మాత్రం సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని వివరించింది.
జూన్ నెలలో వర్షాభావ పరిస్థితులు
రాష్ట్రంలో నైరుతి సీజన్ ప్రారంభ నెలలో వర్షాలు అధికంగా కురుస్తాయి. గత ఐదేళ్లుగా వర్షపాత నమోదును పరిశీలిస్తే సాధారణం కంటే కనీసం 20 శాతం అధిక వర్షాలు నమోదవుతున్నాయి. కానీ ఈ ఏడాది జూన్ నెలలో తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ నెలలో 13.03 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాలి. కానీ నెల ముగిసే వరకు 10.42 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 20 శాతం తక్కువ వర్షాలు కురిశాయి. గతేడాది గణాంకాలను పరిశీలిస్తే 15.90 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గత ఐదేళ్లలో తొలిసారిగా జూన్ నెలలో లోటు వర్షపాతం నమోదైనట్టు రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
మూడు రోజులు..ఎల్లో అలర్ట్
రాష్ట్రంలో రానున్న మూడు రోజులు మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. గురువారం వివిధ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, శుక్ర, శనివారాల్లో చాలాచోట్ల మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇచ్చోడలో 6.2 సెంటీమీటర్ల వర్షం
బుధవారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో 6.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గద్వాల జిల్లా అయిజలో 6.13 సెం.మీ., బజార్‌హత్నూర్‌లో 5.25 సెం.మీ., సరికొండలో 4.1 సెం.మీ., వెంకటాపూర్‌లో 4.05 సెం.మీ. వర్షం కురిసింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 1.96 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 14.0 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 13.8 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు రాష్ట్ర ప్రణాళిక విభాగం తెలిపింది.