
సాక్షి,విశాఖపట్నం/సాక్షి, అమరావతి: దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఆలస్యంగా బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది సముద్ర మట్టానికి 5.8 కిమీ ఎత్తులో కొనసాగుతూ నైరుతి వైపుగా వంగి ఉంది. దీనికి అనుబంధంగా దక్షిణ కర్ణాటక నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్ వరకూ తూర్పు పశ్చిమ గాలుల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు భారీ నుంచి అతి వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అనేక చోట్ల భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురవనున్నాయి.
పలుచోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందనీ.. తీరం వెంబడి గరిష్టంగా 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో నంద్యాల జిల్లా పెరుసోమలలో 7.8, అల్లూరి జిల్లా లంబసింగిలో 5.7, ఏలూరు జిల్లా మిర్జాపురంలో 5.3, కోనసీమ జిల్లా రామచంద్రపురం లో 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కాగా, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసినా..మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా కనిపించింది. శనివారం ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, వైఎస్సార్ కడప జిల్లాల్లో 37 నుంచి 38 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.