
ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు
సాక్షి, అమరావతి, విశాఖపట్నం: దక్షిణ కోస్తాంధ్ర నుంచి ఉత్తర శ్రీలంక వరకు తమిళనాడు తీరం మీదుగా ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 13 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. వీటి ప్రభావంతో శనివారం ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంది.
మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంది. ఆదివారం ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
ఈ అల్పపీడనం తర్వాత ఈ నెల మూడో వారంలో మరో అల్పపీడనం ఉత్తరాంధ్రకు సమీపంలో ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, గడిచిన 24 గంటల్లో దేవరాపల్లిలో 55 మి.మీ. వజ్రకరూర్‌లో 53, రోలుగుంటలో 45, బీకే సముద్రంలో 42, పమిడిలో 40, పుంగనూరులో 37 మి.మీ. వర్షపాతం నమోదైంది.