
24 గంటల తర్వాత వాయుగుండంగా మారే అవకాశం
19న ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో తీరం దాటే అవకాశం
రానున్న రెండు రోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్
రాష్ట్రంలో సాధారణం కంటే 15 శాతం అధికంగా వర్షాలు
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం ఉదయం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. సోమవారం ఉదయానికల్లా ఇది వాయవ్య దిశలో కదిలి మరింత బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత వాయుగుండం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల సమీపంలో ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం నాటికి తీరాన్ని దాటే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల చక్రవాత ఆవర్తనం కొనసాగుతోంది.
ఇది సముద్ర మట్టం నుంచి 9.6 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉంది. అల్పపీడనం, వాయగుండం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉత్తర ప్రాంత జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేసింది. సోమవారం ఈ మూడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశంఉందని, ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
నైరుతి రుతుపవనాల కదలికలు చురుగ్గా ఉండడంతోపాటు రాష్ట్రమంతటా ఆకాశం మేఘావృతమవ్వడంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పతనమయ్యాయి. ఆదివారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 30.8 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 20 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది.
15 శాతం అధిక వర్షపాతం
నైరుతి సీజన్ వర్షాలు సంతృప్తికరంగా ఉన్నాయి. ఆదివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 47.81 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 54.98 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 15 శాతం అధికంగా వర్షాలు నమోదైనట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 5 జిల్లాల్లో అత్యధికంగా, 9 జిల్లాల్లో అధికంగా వర్షాలు కురిశాయి. 19 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఆదివారం ఒక్కరోజు రాష్ట్రంలో సగటున 1.51 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.