
రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు
24న బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, అమరావతి: ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని.. నాలుగైదు రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తిరుపతి, చిత్తూరు, శ్రీకాకుళం, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం తిరుపతి జిల్లా తడ మండలం భీములవారిపాలెంలో 4.5 సెంటీమీటర్లు, చిత్తూరు జిల్లా పెద్దపంజాణిలో 3.5, సోమల మండలం పెద్దఉప్పరపల్లిలో 3.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
శనివారం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 24న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ, వాయవ్య దిశగా కదిలి.. 26వ తేదీన వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది.