
సమ్మె కొనసాగిస్తున్నట్లు వెల్లడించిన పీహెచ్‌సీ వైద్యుల సంఘం
ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామంటూ వెల్లడి
సాక్షి, అమరావతి : ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) వైద్యులతో రాష్ట్ర ప్రభుత్వ చర్చలు విఫలమయ్యాయి. దీంతో సమ్మె యథావిధిగా కొనసాగిస్తున్నట్లు పీహెచ్‌సీ వైద్యుల సంఘం ప్రకటించింది. మెడికల్ పీజీ ఇన్‌సర్వీస్ కోటా, పదోన్నతులు, ఇంక్రిమెంట్లు ఇతర సమస్యలపై వైద్యులు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. వీరి సమ్మెతో గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవలు స్తంభించగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో.. శుక్రవారం సచివాలయంలో వైద్యుల సంఘంతో ప్రభుత్వం మరోమారు చర్చలు జరిపింది. వైద్యశాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్ వైద్యుల సంఘం ప్రతినిధులతో మాట్లాడారు. గతంలో వెల్లడించినట్లే క్లినికల్ స్పెషాలిటీల్లో ఈ విద్యా సంవత్సరానికి 20 శాతం ఇన్‌సర్వీస్ కోటా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ట్రైబల్ అలవెన్సు, నోషనల్ ఇంక్రిమెంట్లు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు, సర్వీసు వ్యవహారాలకు సంబంధించిన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలమని.. వెంటనే విధుల్లో చేరాలని వైద్యులను కోరారు.
అయితే, వైద్యులు మాత్రం 2030 వరకూ 20 శాతం ఇన్‌సర్వీస్ కోటా కొనసాగించాలని పట్టుబట్టినట్లు తెలిసింది. ఇందుకు ప్రభుత్వం ససేమిరా అనడంతో 2026–27 నుంచి కనీసం మూడేళ్ల పాటు క్లినికల్ స్పెషాలిటీల్లో 15 శాతం కోటా కల్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై వచ్చే నెలలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని గౌర్ చెప్పారు. పాలసీ రూపకల్పనలో సంఘం ప్రతినిధులను భాగస్వామ్యం చేస్తామన్నారు.
రెండ్రోజుల్లో తదుపరి కార్యాచరణ
ఈ ఒక్క ఏడాదికే 20 శాతం కోటా కల్పిస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనతో పీహెచ్‌సీ వైద్యులు ఏకీభవించలేదు. ఏటా కోటాపై రివ్యూ చేస్తూపోతే తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకూ వెనక్కి తగ్గబోమని పీహెచ్‌సీ వైద్యుల సంఘం కోశాధికారి డాక్టర్ వినోద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తమ ఆందోళనలను తీవ్రతరం చేయనున్నామని వెల్లడించారు. ఇప్పటికే వైద్యశాఖలోని 24 సంఘాలు తమ సమ్మెకు మద్దతు ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు. వారందరినీ భాగస్వామ్యం చేసుకుని సమ్మెను మరింత ఉధృతం చేస్తామన్నారు. రెండ్రోజుల్లో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.