
రాష్ట్రంలోని కార్స్ నెట్‌వర్క్ జాతీయస్థాయి ప్లాట్‌ఫాంకి అనుసంధానం
ఒప్పందంపై సంతకాలు చేసిన ఉన్నతాధికారులు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే దేశంలో తొలిసారి కార్స్ నెట్‌వర్క్ ఏర్పాటు
సాక్షి, అమరావతి: కార్స్ నెట్‌వర్క్ వినియోగంపై రాష్ట్ర సర్వే, సెటిల్‌మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ, సర్వే ఆఫ్ ఇండియా శుక్రవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 70 కంటిన్యూయస్‌లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్ (సీవోఆర్‌ఎస్–కార్స్) జాతీయ నెట్‌వర్క్‌తో అనుసంధానం కానున్నాయి. మంగళగిరిలోని సర్వే సెటిల్మెంట్స్, ల్యాండ్ రికార్డ్స్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా హితేష్‌కుమార్ మఖవాన, ఏపీ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.జయలక్ష్మి, డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ఈ ఒప్పందం చేసుకున్నారు.
ఈ సందర్భంగా సర్వేయర్ జనరల్ మఖవాన మాట్లాడుతూ దేశంలో మొదటిసారిగా ఏపీ పూర్తిస్థాయి కార్స్ నెట్‌వర్క్ ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి సుమారు రూ.4.8 కోట్ల వార్షిక లాభం వస్తుందని, జియోడేటా మౌలిక సదుపాయం కేంద్ర సహకారంతో బలపడనుందని చెప్పారు. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.జయలక్ష్మి మాట్లాడుతూ ఈ ఒప్పందం వల్ల రాష్ట్రానికి సంవత్సరానికి సుమారు రూ.2.1 కోట్లు ఆదా అవుతాయని తెలిపారు.
ఐదేళ్లపాటు కార్స్ నెట్‌వర్క్ నిర్వహణ, అప్‌గ్రెడేషన్ బాధ్యతలను సర్వే ఆఫ్ ఇండియా తీసుకుంటుందని చెప్పారు. సర్వే సెటిల్మెంట్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ మాట్లాడుతూ ఈ ఒప్పందం రాష్ట్రాన్ని జియోస్పేషియల్ రంగంలో దేశానికి మార్గదర్శకంగా నిలబెడుతుందని పేర్కొన్నారు.
ఈ ఘనత వైఎస్సార్‌సీపీదే
వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలో ప్రారంభమైన భూముల రీసర్వే ఎంత ప్రతిష్టాత్మకమో ఈ ఒప్పందం ద్వారా రుజువైంది. రీసర్వే కోసం జగన్ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా పూర్తిస్థాయి కార్స్ నెట్‌వర్క్ ఏర్పాటు చేసింది. కానీ చంద్రబాబు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికలకు ముందు రీసర్వేపై పచ్చి అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు చేశారు. ఇప్పుడు ఆయన ప్రభుత్వమే కార్స్ నెట్‌వర్క్‌ను జాతీయ ప్లాట్‌ఫాంకి అనుసంధానం చేసింది.
వైఎస్ జగన్ హయాంలో చేపట్టిన భూముల రీసర్వే ఎంత ముందుచూపుతో చేసిందో ఇప్పుడు అర్థమవుతోంది. బ్రిటిష్ హయాం తర్వాత మళ్లీ రాష్ట్రంలో భూముల సర్వే జరక్కపోవడంతో అనేక భూ వివాదాలు పేరుకుపోయాయి. దీంతో రాష్ట్రంలోని భూములను రీసర్వే చేసి హద్దులు నిర్ణయించడతోపాటు డిజిటల్ రికార్డులు రూపొందించడం ద్వారా భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీని మార్చాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రణాళిక రూపొందించారు.
వైఎస్ జగన్ హయాంలో 70 కార్స్ స్టేషన్లు ఏర్పాటు
రీసర్వే కోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 70 కార్స్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇది నిరంతరం పనిచేసే శాశ్వత జీఎన్‌ఎస్‌ఎస్ రిసీవర్ల వ్యవస్థ. ఈ స్టేషన్లు నిరంతరం ఉపగ్రహ డేటాను సేకరించి సెంట్రల్ సర్వర్‌కి పంపుతాయి. దీనిద్వారా మనం ఉన్న స్థానాన్ని కచ్చితంగా చూసుకోవచ్చు. దీనివల్ల సర్వేయర్లు సొంత బేస్‌స్టేషన్లు ఏర్పాటు చేసుకోకుండానే సెంటీమీటర్ స్థాయి కచ్చితత్వంతో భూములను కొలిచే అవకాశం ఉంటుంది. వైఎస్ జగన్ హయాంలో 17 వేల గ్రామాల్లో వీటి ద్వారానే రీసర్వే విజయవంతంగా జరిగింది.
హద్దులు నిర్ణయించి శాటిలైట్ వ్యవస్థ దాన్ని పర్యవేక్షిస్తుండడం వల్ల భూముల సరిహద్దులను ఎప్పటికీ మార్చడం సాధ్యం కాదు. అందుకే కేంద్రం రాష్ట్రంతో ఒప్పందం చేసుకుని మన టెక్నాలజీని వినియోగించుకోవాలని చూస్తోంది. ఇంతటి గొప్ప టెక్నాలజీతో భూముల రీసర్వే, దానికి అనుబంధంగా ల్యాండ్ టైట్లింగ్ చట్టం చేస్తే దాన్ని చంద్రబాబు రాజకీయాలకు ఉపయోగించుకుని ప్రజల మెదళ్లలో విషం నింపారు. తద్వారా ఎన్నికల్లో లబి్ధపొందినా రాష్ట్రానికి మాత్రం తీరని ద్రోహం చేశారు.