
ఫిర్యాదు చేసిన ఐదేళ్ల తర్వాత అనుమానితులను విచారిస్తారా?
కుమార్తె బతికుందో.. లేదో.. తెలియకుంటే తల్లిదండ్రుల వేదన ఎలా ఉంటుందో తెలుసా?
తాజా పురోగతిపై స్థాయీ నివేదిక ఇవ్వండి
ఓ వివాహిత అదృశ్యంపై కేసులో పశ్చిమ గోదావరి పోలీసులకు హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: ఓ వివాహిత 13 ఏళ్ల క్రితం అదృశ్యమైతే ఆమె ఆచూకీని పోలీసులు ఇప్పటికీ తెలుసుకోలేకపోయారా.. అని హైకోర్టు విస్మయం వ్యక్తంచేసింది. తమ కుమార్తె బతికుందో.. లేదో.. కూడా తెలియకుంటే ఆ తల్లిదండ్రుల వేదన ఎలా ఉంటుందో మీకు తెలుసా? అంటూ పోలీసులను ప్రశ్నించింది. తల్లిదండ్రుల వేదనను మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
తన కుమార్తె అదృశ్యం విషయంలో కొందరిపై అనుమానం వ్యక్తం చేస్తూ తండ్రి ఫిర్యాదు చేస్తే, వారిని సకాలంలో విచారించకపోవడంపై హైకోర్టు మండిపడింది. దర్యాప్తు ఎలా చేయాలో, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా తెలియదా? అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వ్యక్తుల అదృశ్యం కేసుల్లో ప్రతి నిమిషమూ కీలకమని స్పష్టంచేసింది. ఘటన జరిగిన మొదట్లోనే ఫిర్యాదు చేస్తే తీరిగ్గా ఆ తర్వాత ఎప్పుడో అనుమానితులను విచారిస్తే ప్రయోజనం ఏముంటుందని పోలీసులను ప్రశ్నించింది.
దర్యాప్తు సాగిన తీరు విషయంలో తామెంత మాత్రం సంతృప్తికరంగా లేమంది. తాజాగా పురోగతికి సంబంధించిన వివరాలతో స్థాయీ నివేదికను తమ ముందుంచాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ, కొవ్వూరు డీఎస్పీ, తాడేపల్లిగూడెం ఎస్‌హెచ్‌వోలను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
దర్యాప్తు పక్కన పడేసిన పోలీసులు..
పశ్చిమ గోదారి జిల్లా జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం గ్రామానికి చెందిన బండారు ప్రకాశరావు తన కుమార్తె మంగాదేవిని దండగర్ర గ్రామానికి చెందిన మోహన బ్రహ్మాజీ అనే వ్యక్తికిచ్చి వివాహం చేశారు. 2012 అక్టోబర్ 18న ప్రకాశరావుకు ఆయన అల్లుడు బ్రహ్మాజీ ఫోన్ చేసి మంగాదేవి కనిపించడం లేదని చెప్పారు. ప్రకాశరావు అదే రోజున తాడేపల్లిగూడెం పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
దర్యాప్తును మాత్రం పక్కన పడేశారు. దీంతో ప్రకాశరావు 2017లో హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి హైకోర్టు ఈ వ్యాజ్యంపై పలుమార్లు విచారణ జరిపింది. తాజాగా శుక్రవారం ఈ వ్యాజ్యం న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ముందు విచారణకు వచ్చింది. జిల్లా ఎస్పీ తదితరులు కోర్టు ముందు హాజరయ్యారు. ఈ కేసులో పోలీసులు సాగించిన దర్యాప్తు తీరుపై న్యాయమూర్తి అసహనం వ్యక్తంచేశారు.
అనుమానితుల్లో ఉన్న అదృశ్యమైన మహిళ భర్తను ఫిర్యాదు ఇచ్చిన ఐదేళ్ల తర్వాత విచారించడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. రైల్వేస్టేషన్లలో, మీ–సేవా కేంద్రాల్లో వెతికామంటూ రంగురంగుల ఫొటోలు వేస్తే ఏం ప్రయోజనం ఉంటుందని ప్రశ్నించారు. దర్యాప్తు సక్రమంగా సాగినప్పుడు ఫలితం ఉంటుందని తెలిపారు. ఈ కేసులో తాజా పురోగతితో స్థాయీ నివేదికను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.