
విజయవాడ ధర్నా చౌక్ వద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల నిరసన
2030 వరకూ 20 శాతం ఇన్ సర్వీస్ కోటా కొనసాగించాలని డిమాండ్
మా సమస్యలపై స్పష్టమైన హామీ ఇచ్చేవరకూ ఆందోళన విరమించం
ప్రభుత్వానికి తేల్చి చెప్పిన పీహెచ్‌సీ వైద్యుల అసోసియేషన్ నేతలు
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు): ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) వైద్యులు, ప్రభుత్వం మధ్య చర్చలు కొలిక్కి రావడం లేదు. పీజీ మెడికల్ కోర్సుల్లో ఇన్ సర్వీస్ కోటా క్లినికల్ విభాగంలో 20 శాతం కొనసాగించాలని వైద్యులు భీష్మించారు. ఇందుకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఆదివారం కూడా చర్చలు విఫలమయ్యాయి. ఏటా ఇన్ సర్విస్ కోటాపై పునఃసమీక్షించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2030 వరకూ అన్ని క్లినికల్ కోర్సులకు 20 శాతం కోటా వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పీహెచ్‌సీ వైద్యులు చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం రెండో రోజు కొనసాగాయి. ఎనీ్టఆర్ జిల్లా విజయవాడ ధర్నా చౌక్‌లో నిర్వహిస్తున్న ఈ దీక్షల్లో రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన వైద్యులు పాల్గొంటున్నారు. తమ డిమాండ్‌లపై స్పష్టమైన రాతపూర్వక హామీ ఇచ్చే వరకూ ఆందోళన విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. పీహెచ్‌సీ వైద్యులు 20 ఏళ్లు పదోన్నతులు లేకుండా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
టైమ్ బౌండ్ ప్రమోషన్లు, ఇన్–సర్విస్ పీజీ కోటాను పునరుద్ధరించడం, నోషనల్ ఇంక్రిమెంట్ల మంజూరు, గిరిజన ప్రాంతాల్లో సేవలందిస్తున్న వైద్యులకు 50 శాతం మూలవేతనాన్ని గిరిజన భత్యంగా చెల్లించడం, చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమానికి రూ.5 వేల భత్యం మంజూరు చేయడం, స్థానికత్వం–పట్టణ వైద్యాధికారుల సర్విస్ అర్హత సమస్యలను పరిష్కరించడం తమ ప్రధాన డిమాండ్‌లని పేర్కొన్నారు. నిరసనలో అసోసియేషన్ నేతలతో పాటు, వందలాది మంది వైద్యులు పాల్గొన్నారు. కాగా, టైమ్ బౌండ్ పదోన్నతులు, ట్రైబల్ అలవెన్స్‌లకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందని, అయినప్పటికీ వైద్యులు అంగీకరించలేదని సంక్షేమ కమిషనర్ వీరపాండియన్ ఓ ప్రకటనలో తెలిపారు. వైద్యుల తీరుపట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.