
3వ రోజు విధులు బహిష్కరించి ఆందోళనలు చేసిన డాక్టర్లు
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్న ప్రభుత్వం ఆచరణలో విఫలం
సాక్షి, అమరావతి: పీహెచ్‌సీ వైద్యుల సమ్మె నేపథ్యంలో రాష్ట్రంలోని గ్రామీణ, గిరిజనప్రాంత ప్రజలకు ప్రత్యామ్నాయ వైద్యసేవల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది. దీంతో గ్రామీణ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పీజీ వైద్యవిద్యలో ఇన్‌సర్వీస్ కోటా 20 శాతానికి పునరుద్ధరణ, పదోన్నతులు, అలవెన్స్‌ల మంజూరు వంటి డిమాండ్లతో సోమవారం నుంచి పీహెచ్‌సీ వైద్యులు చేపట్టిన సమ్మె బుధవారం మూడోరోజు కూడా కొనసాగింది.
శ్రీసత్యసాయి జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాల్లో వైద్యులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కలెక్టరేట్‌లు, డీఎంహెచ్‌వో కార్యాలయాల ముందు ఆందోళనలు, ర్యాలీలు చేశారు. ఉన్నతాధికారులకు వినతిపత్రాలిచ్చారు. జిల్లాల్లో మహిళా వైద్యులు వినూత్న పద్ధతుల్లో నిరసన తెలుపుతూ వీడియోలు చిత్రీకరించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
దగాచేసిన ప్రభుత్వం
గతేడాది ఇదే మాదిరిగా సమ్మె చేసినప్పుడు ప్రభుత్వం దిగివచ్చి చర్చలు జరిపినట్టు వైద్యులు గుర్తుచేశారు. అప్పట్లో 20 శాతం ఇన్‌సరీ్వస్ కోటాను వైద్యవిద్య పీజీలో అన్ని బ్రాంచ్‌లకు వర్తింపజేసినట్టు తెలిపారు. ఇదే విధానాన్ని మరో రెండు, మూడేళ్లు కొనసాగించాలని కోరగా సరే అని ప్రభుత్వం హామీ ఇచి్చందని గుర్తుచేశారు. అయితే 10 నెలలు కూడా తిరగకుండానే మళ్లీ 20 శాతం కోటాను 15 శాతానికి కుదించి కూటమి ప్రభుత్వం దగా చేసిందన్నారు. ఇది కూడా కేవలం ఏడు బ్రాంచ్‌లకు పరిమితం చేశారని మండిపడ్డారు.
చర్చలు విఫలం
అధికారుల నుంచి స్పష్టమైన హామీలు రాకపోవడంతో తమ సమ్మెను యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించినట్టు వైద్యుల సంఘం ప్రతినిధి డాక్టర్ వినోద్ తెలిపారు. గురువారం ఛలో విజయవాడ చేపడతామని తెలిపారు. శుక్రవారం నుంచి ఆమరణ దీక్షలకు పూనుకుంటామని స్పష్టం చేశారు.
తమ సమస్యలు పరష్కరించేవరకూ వెనకడుగు వేసేది లేదన్నారు. వైద్యులు చేస్తున్న సమ్మెకు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్, కార్యదర్శి సందీప్ ప్రకటన విడుదల చేశారు.
సీఏఎస్(జనరల్) వైద్యుల సమ్మె నోటీస్
పీహెచ్‌సీ వైద్యులు తరహాలోనే డైరెక్టర్ సెకండరీ హెల్త్ పరిధిలో పని చేస్తున్న సీఏఎస్(జనరల్) వైద్యులు బుధవారం ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. ఇన్ సర్వీస్ కోటా ఇతర సమస్యలు పరిష్కరించకపోతే శుక్రవారం నుంచి డెప్యుటేషన్‌పై పీహెచ్‌సీల్లో ఓపీ సేవలు, సీహెచ్‌సీల్లో సాధారణ సేవలు అందించేది లేదన్నారు. 6 నుంచి ఎమర్జెన్సీ సేవలు నిలిపేస్తామని ప్రకటించారు.