
రిలే దీక్షల్లో పీహెచ్‌సీ వైద్యులు
ఎనిమిదో రోజుకు చేరిన నిరసనలు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ధర్నా చౌక్‌లో పీహెచ్‌సీ వైద్యులు చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం ఎనిమిదో రోజుకు చేరాయి. ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ రిలే దీక్షల్లో రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి వైద్యులు పాల్గొంటున్నారు. అసోసియేషన్ పిలుపు మేరకు రాష్ట్రంలోని 2,700 మంది వైద్యులు విధులు బహిష్కరించి దీక్షలు చేపట్టారు.
తమ డిమాండ్‌లను ప్రభుత్వం పరిష్కరించే వరకూ ఆందోళనను విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. నోషనల్ ఇంక్రిమెంట్స్, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి అదనపు భత్యం, టైమ్‌బాండ్ పదోన్నతులు, స్కేల్స్ వర్తింపు వంటి అనేక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రిలే దీక్షల్లో అసోసియేషన్ నాయకులు డాక్టర్ వినోద్‌కుమార్, డాక్టర్ రవీంద్రనాయక్, డాక్టర్ గోపినాథ్, డాక్టర్ కిషోర్‌తో పాటు, వందలాది వైద్యులు పాల్గొన్నారు.
నేటి నుంచి సిబ్బంది నిరసన..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పీహెచ్‌సీలు, సెకండరీ హెల్త్ సెంటర్స్‌లోని వైద్య సిబ్బంది సోమవారం నుంచి వైద్యులకు మద్దతుగా నల్లబ్యాడ్జిలు ధరించి విధులకు హాజరుకానున్నారు. లంచ్ సమయంలో సమావేశాలు, నిరసనలు తెలిపేందుకు నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్రంలోని వైద్యులతో పాటు, వైద్య సిబ్బంది కూడా నిరసనలో పాల్గొంటారని డాక్టర్స్ అసోసియేషన్ నేతలు తెలిపారు.