
పాడేరులో పీహెచ్‌సీ వైద్యుల ధర్నా
జిల్లాల్లో విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టిన పీహెచ్‌సీ వైద్యులు
ఏపీవీవీపీ, డీఎంఈ వైద్యులతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఒట్టి మాటలే
పీహెచ్‌సీ వైద్యుల సమ్మెకు ఏపీవీవీపీ డాక్టర్ల మద్దతు
నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్‌సీలు) వైద్యసేవలు స్తంభించాయి. వైద్యులు సమ్మెలోకి వెళ్లడంతో పీహెచ్‌సీల్లో నాడి పట్టే నాథుడు కరువయ్యారు. ఇన్–సర్విస్ కోటా కుదింపును నిరసిస్తూ, ఇతర సమస్యల పరిష్కారం కోసం పీహెచ్‌సీ వైద్యులు సమ్మె బాటపట్టిన విషయం తెలిసిందే. పూర్తి స్థాయిలో పీహెచ్‌సీ సేవలను బహిష్కరించిన వైద్యులు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా డీఎంహెచ్‌వో కార్యాలయాల ముందు టెంట్లు వేసుకుని నిరసన తెలపడంతోపాటు ర్యాలీలు, ఇతర మార్గాల్లో ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు.
ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమ్మె విరమించకపోతే ఎస్మా ప్రయోగిస్తామని వైద్యశాఖ హెచ్చరించినా, వైద్యులు ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. వైద్యులు సమ్మెలోకి వెళ్లడంతో పీహెచ్‌సీల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు సోమవారం వైద్యశాఖ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన్ పరిషత్(ఏపీవీవీపీ), డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)ల్లోని సివిల్ అసిస్టెంట్ సర్జన్స్(సీఏఎస్), వైద్య విద్యార్థులతో పీహెచ్‌సీల్లో సేవలు అందేలా చూస్తామని తెలిపింది. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో వైద్యశాఖ విఫలమైంది. ఎక్కడా పీహెచ్‌సీల్లో ప్రత్యామ్నాయ వైద్యులు కనిపించలేదు.
రోగులకు నరకం
వైద్యులు సమ్మెలోకి వెళ్లడంతో విషజ్వరాలు, డెంగీ, మలేరియా, ఇతర సీజనల్ వ్యాధుల బారినపడ్డ గ్రామీణ జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆపసోపాలు పడి వైద్యం కోసం పీహెచ్‌సీల వరకూ వెళితే... అక్కడ వైద్యులు లేకపోవడంతో బాధితుల పరిస్థితి అయోమయంగా మారుతోంది. స్థానికంగా ఉండే ఆర్‌ఎంపీలు, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బు పెట్టి చికిత్సలు చేయించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల జ్వరం, దగ్గు, జలుబు వంటి చిన్నచిన్న అనారోగ్య సమస్యలతో పీహెచ్‌సీలకు వచి్చనవారికి స్టాఫ్ నర్సులే మందులు ఇచ్చి పంపేస్తున్నారు.
ఏపీవీవీపీ వైద్యుల మద్దతు
పీహెచ్‌సీ వైద్యుల సమ్మెకు ఏపీవీవీపీ వైద్యుల సంఘం మద్దతు తెలియజేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. పీహెచ్‌సీ వైద్యులు చేస్తున్న పోరాటంలో ఏపీవీవీపీ వైద్యులకు సంబంధించిన కొన్ని సమస్యలు కూడా ఉన్నాయని ఏపీవీవీపీ వైద్యుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.రోహిత్ తెలిపారు. వీరి సమ్మెకు మద్దతుగా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావాలని నిర్ణయించామన్నారు. తదుపరి కార్యాచరణపై జేఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం
సీజనల్ వ్యాధుల కట్టడిలో పీహెచ్‌సీ వైద్యులదే కీలక పాత్ర. తమ పరిధిలో జ్వరాలు, ఇతర కేసుల నమోదును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ బాధితులకు వైద్య పరీక్షలు చేయడంతోపాటు వ్యాధులు వ్యాప్తిచెందకుండా నియంత్రణా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కొద్ది రోజులుగా రాష్ట్రం మొత్తం ముసురుపట్టింది. వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో సీజనల్ వ్యాధులు మరింత వేగంగా వ్యాపిస్తున్నాయి.
ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో వైద్యుల సమస్య పరిష్కరించకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపనుంది. పీజీ ఇన్–సర్విస్ కోటా కుదింపు ఉత్తర్వులు వెలువడిన వెంటనే వైద్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఫలితం లేకపోవడంతో సమ్మెలోకి వెళ్లడానికి వెనుకాడబోమని పది రోజుల క్రితమే నోటీస్ ఇచ్చారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పూర్తిస్థాయిలో సమ్మెబాట పట్టారు.