
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాల మధ్య ఉన్న తీవ్ర అల్పపీడనం శనివారం ఉదయానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం విజయనగరంలో 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో 5.4, శ్రీకాకుళంలో 4.8, విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 4.2, డెంకాడ, ప్రకాశం పెద్దారవీడులో 4.2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. శనివారం కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. శనివారం కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు.. మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.