
రాష్ట్రవ్యాప్తంగా కార్యాలయాల వద్ద ధర్నాలు
నల్ల బాడ్జీలు ధరించి నిరసన తెలిపిన సిబ్బంది
మరోవైపు ప్రభుత్వం, యాజమాన్యంతో చర్చలు
జేఏసీతో కలిసి పోరాడతామన్న స్ట్రగుల్ కమిటీ
సాక్షి, అమరావతి: విద్యుత్ శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సమ్మె చేపడితే తాము కూడా వారితో కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ చైర్మన్ పి.సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర జనరల్ సెక్రటరీ వెన్నపూస సుబ్బిరెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ సమ్మెను జేఏసీ విరమించుకుంటే తమ కమిటీ దశల వారీ ఆందోళనలతో యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొస్తుందని వెల్లడించారు.
స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం అన్ని జిల్లాల్లో విద్యుత్ కార్యాలయాలు, ఉత్పత్తి కేంద్రాల వద్ద ఉద్యోగులు, కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించారు. ఆపై నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా పలుచోట్ల ఆందోళనల్లో పాల్గొన్న వారు మాట్లాడుతూ..కాంట్రాక్టు కార్మికులను విద్యుత్ సంస్థల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగుల పెండింగ్ డీఏలు, అన్ లిమిటెడ్ మెడికల్ పాలసీ అందించాలనే డిమాండ్ల విషయంలో యాజమాన్యం మొండి వైఖరిని విడనాడాలని వారు డిమాండ్ చేశారు.
విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలనేది చిరకాల కోరికని, న్యాయమైన డిమాండ్ అని చెప్పారు. అధికారం లేనప్పుడు హామీ ఇచ్చి, తీరా అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీని తంగలో తొక్కడం పాలకులకు పరిపాటిగా మారిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. థర్డ్ పార్టీ కాంట్రాక్టు వ్యవస్థను తొలగించి యాజమాన్యమే నేరుగా కార్మికులకు వేతనాలు చెల్లించడం వల్ల ప్రైవేటు కాంట్రాక్టర్లకు చెల్లించే సూపర్‌వైజర్ చార్జీలు పన్నుల రూపంలో విద్యుత్ సంస్థలకు రూ.192 కోట్లు ఆదా అవుతాయని చెప్పినా కూడా విద్యుత్ యాజమాన్యాలు ఆ దిశగా ఆలోచించడం లేదన్నారు.
సంస్థలకు కూడా ప్రయోజనం కలిగే విషయాల్లో అంగీకారం తెలపడానికి ఉన్న అడ్డంకులు ఏంటో ప్రభుత్వం యాజమాన్యం చెప్పాలన్నారు. తెలంగాణలో విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను సంస్థలో విలీనం చేసుకుని పే స్కేల్స్ ఇస్తున్నారని, అక్కడ లేని అభ్యంతరాలు న్యాయపరమైన చిక్కులు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎందుకొస్తాయని వారు ప్రశ్నించారు. పెన్షన్ భిక్ష కాదని, అది కార్మిక, ఉద్యోగుల హక్కు అని అన్నారు.