
మంగళవారం అర్ధరాత్రి వరకుఉద్యోగులు, యాజమాన్యాల మధ్య చర్చలు
కాంట్రాక్టు కార్మికుల విలీనానికి అంగీకరించని యాజమాన్యం
సీఎం చంద్రబాబు ఒప్పుకోవడం లేదని ఉద్యోగులకు చెప్పిన స్టీరింగ్ కమిటీ
ప్రధాని పర్యటన నేపథ్యంలో సమ్మె వాయిదా వేయాలని కోరిన ప్రభుత్వం
అంగీకరించిన ఉద్యోగ సంఘాల నాయకులు
17వ తేదీ సాయంత్రం 3గంటలకు చర్చల అనంతరం సమ్మెపై నిర్ణయం
సాక్షి,అమరావతి: విద్యుత్ ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యం మంగళవారం జరిపిన చర్చలు అర్ధరాత్రి దాటిన తరువాత అసంపూర్తిగా ముగిశాయి. విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) చైర్మన్ ఎస్.కృష్ణయ్య, ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస్, సహాధ్యక్షుడు కేవీ శేషారెడ్డి, 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీ గోపాలరావు, జేఏసీ కన్వినర్ ఎంవీ రాఘవరెడ్డిలతో కూడిన దాదాపు 30 మంది సభ్యుల బందం చర్చలకు వెళ్లింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలు, ఏపీజెన్‌కో ఎండీతో కూడిన అధికారుల బృందం వారితో చర్చలు జరిపింది. జేఏసీ ప్రతిపాదించిన డిమాండ్లలో ప్రధాన సమస్యలను స్టీరింగ్ కమిటీ తిరస్కరించింది. అయితే ఈ నెల 16న రాష్ట్రంలో ప్రధాని నరేంద్రమోదీ∙పర్యటన ఉన్న నేపథ్యంలో సమ్మెను రెండు రోజులు వాయిదా వేయాల్సిందిగా జేఏసీని ప్రభుత్వం కోరింది.
అలాగే 17వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ చర్చలకు రావాల్సిందిగా ఆహ్వా నించింది. దీంతో ఆ రోజు వరకూ సమ్మె వాయిదా వేస్తున్నామని, చర్చల అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని జేఏసీ ప్రకటించింది. మరోవైపు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యుత్ సంస్థల కార్యాలయాల్లో ఉద్యోగులు ‘వర్క్ టు రూల్’ పాటించి నిరసన తెలిపారు.
ప్రధాన డిమాండ్లకు లభించని అంగీకారం: విద్యుత్ సంస్థల్లో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను సంస్థల్లో విలీనం చేయడానికి సీఎం చంద్రబాబు ఒప్పుకోవడం లేదని జేఏసీ నేతలతో చర్చల సందర్భంగా స్టీరింగ్ కమిటీ వ్యాఖ్యానించినట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.
కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను కూడా 100 శాతం ఇవ్వడం కుదరదని, 50 శాతం ఇవ్వడానికి ఆలోచిస్తామని కమిటీ చెప్పిందని వారు తెలిపారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడం, జూనియర్ లైన్ మెన్ గ్రేడ్–2 (ఎనర్జీ అసిస్టెంటు)లకు విద్యుత్ సంస్థల్లో అమలులో ఉన్న పాత సర్వీసు నిబంధనలు వర్తింపజేయడం వంటి ప్ర«దాన డిమాండ్లపై చర్చల్లో సానుకూలత రాలేదు.
సమ్మెలో పాల్గొంటే చర్యలు
సమ్మె చేపడుతున్నట్లు జేఏసీ చేసిన హెచ్చరికల నేపధ్యంలో విద్యుత్ సంస్థలు అప్రమత్తమయ్యాయి. సమ్మెలో పాల్గొని విధులకు హాజరుకాని శాశ్వత, తాత్కాలిక ఉద్యోగుల వివరాలను రోజూ సాయంత్రం 5 గంటలకల్లా హెచ్‌ఆర్‌డీ చీఫ్ జనరల్ మేనేజర్‌కు అందజేయాల్సిందిగా ఆదేశించారు.
ఆ జాబితా ప్రకారం సమ్మెలో పాల్గొనే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాయి. ఈ మేరకు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు మంగళవారం అన్ని జిల్లాల సూపరింటెండెంట్ ఇంజనీర్(ఎస్‌ఈ)లను ఆదేశించారు.