
మాట్లాడుతున్న విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు
రేపు విద్యుత్ ఉద్యోగుల చలో విజయవాడ
15 నుంచి రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె
15న ఉదయం 6 గంటల తర్వాత ఫోన్లు బంద్
ఆందోళనలో 63,600 మంది ఉద్యోగులు
యాజమాన్యం మొండి వైఖరి వీడేవరకూ ఉద్యమం
ప్రభుత్వానికి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ హెచ్చరిక
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే తమ పవర్ ఏమిటో చూపిస్తామని ఏపీ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ (ఏపీఎస్ పీఈజేఏసీ) హెచ్చరించింది. తాము చేస్తున్న ఆందోళనపై ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యాలు స్పందించకపోవడంతో ఈ నెల 15 నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నట్టు జేఏసీ వెల్లడించింది. 1104 యూనియన్ విజయవాడ కార్యాలయంలో శనివారం జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడారు.
గత నెలలో వారం రోజుల పాటు చేసిన ఆందోళన తర్వాత ఇటీవల చర్చలకు పిలిచిన యాజమాన్యం ఒక్క హామీని కూడా నెరవేర్చడానికి అంగీకరించలేదని జేఏసీ అధ్యక్షుడు ఎస్.కృష్ణయ్య తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో నిరవధిక సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించామన్నారు. ఈ నెల 13న చలో విజయవాడ పేరిట ధర్నా చేస్తామన్నారు. రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులంతా ఆ రోజు విజయవాడలోని ధర్నాచౌక్ వద్దకు వచ్చి నిరసనను తెలియజేస్తారన్నారు.
14న జేఏసీ తిరిగి సమావేశమవుతుందని, అప్పటికి కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోతే 15వ తేదీ∙ఉదయం 6 గంటల నుంచి సమ్మె మొదలవుతుందని స్పష్టం చేశారు. ఈ సమ్మెలో శాశ్వత (రెగ్యులర్) ఉద్యోగులు 34,600, తాత్కాలిక (కాంట్రాక్టు) కార్మికులు 29 వేల మంది కలిపి మొత్తం 63,600 మంది ప్రత్యక్షంగా ఆందోళనల్లో పాల్గొంటారని 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీ గోపాలరావు చెప్పారు.
మరో 27,638 మంది కుటుంబ పెన్షనర్లు కూడా ఉద్యమానికి మద్దతు తెలిపారన్నారు. ఈ నెల 15న ఉదయం ఉద్యోగులంతా తమ సెల్‌ఫోన్ సిమ్ కార్డులను యాజమాన్యాలకు తిరిగి ఇచ్చేస్తారని, ఆ తరువాత ఎక్కడైనా విద్యుత్ సమస్యలు తలెత్తితే ఫోన్లు పనిచేయక సిబ్బంది హాజరు కాలేరని జేఏసీ ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస్ చెప్పారు.
విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తి ఆగిపోవడం వల్ల బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధర చెల్లించి విద్యుత్ కొనాల్సి వస్తుందని జేఏసీ కన్వీనర్ ఎంవీ రాఘవరెడ్డి చెప్పారు. దీనికంతటికీ రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగుల పట్ల యాజమాన్యం మొండి వైఖరితో వ్యవహరిస్తోందని జేఏసీ కో–చైర్మన్ కేవీ శేషారెడ్డి, కాంట్రాక్ట్ యూనియన్ల నేతలు బాలకాశీ, నాగార్జున, నాగరాజు మండిపడ్డారు.
ఉద్యోగుల ముఖ్యమైన డిమాండ్లివీ
» కాంట్రాక్ట్ లేబర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను విద్యుత్ సంస్థల్లో విలీనం చేయాలి.
» విద్యుత్ ఉద్యోగులకు, పెన్షనర్లకు, వారి కుటుంబ సభ్యులకు నగదురహిత అపరిమిత వైద్య సౌకర్యం
కల్పించాలి.
» జూనియర్ లైన్‌మెన్ గ్రేడ్–2 (ఎనర్జీ అసిస్టెంట్)లకు పాత సర్వీసు నిబంధనలు వర్తింపజేయాలి. వారికి అసిస్టెంటు లైన్‌మెన్‌గా పదోన్నతి కల్పించాలి.
» కారుణ్య నియామకాలు కల్పించటంలో కన్సాలిడేటెడ్ పే ఇస్తున్న పద్ధతిని రద్దుచేసి పాత పద్ధతినే కొనసాగించాలి.
» పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏ/డీఆర్‌లను మంజూరు చేయాలి. ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ప్రకారం జీతం స్కేల్స్ రూపొందించాలి.
» ఇంజనీరింగ్ డిగ్రీ కలిగిన జూనియర్ ఇంజనీర్లకు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా పదోన్నతిలో ఒక ప్రత్యేకమైన అవకాశం కల్పించాలి.
» అర్హులైన ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్‌ఎం) తదితర సర్వీసులకు చెందిన ఉద్యోగులను జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్ ఖాళీలలో నియమించాలి.
» 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లను కాంట్రాక్టుకు ఇవ్వడం ఉపసంహరించాలి.
» అన్ని విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయాలి. పని ప్రమాణాల ప్రకారం అదనపు పోస్టులు మంజూరు చేయాలి.
» పర్సనల్ ‘పే’ని ఎన్‌క్యాష్‌మెంట్ లీవ్, పదవీ విరమణ చేసినప్పుడు టెర్మినల్ లీవుతో కలిపి పేమెంట్ చేయాలి.
» విద్యుత్ సంస్థలలో ఉన్న అన్ని ట్రస్టులను బలోపేతం చేసి మూడు నెలలకు ఒకసారి ట్రస్టు అడ్వైజరీ కమిటీ మీటింగ్‌లను నిర్వహించాలి.