సెలవులు రద్దుచేసిన విద్యుత్ సంస్థలు
సెలవులో ఉన్నవాళ్లంతా తక్షణం విధుల్లో చేరాలని ఆదేశాలు
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించకపోగా వారి మెడపై కత్తులు వేలాడదీస్తోంది కూటమి ప్రభుత్వం. తమ డిమాండ్ల సాధన కోసం గత నెల నుంచి ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలను అణచివేయాలని చూస్తోంది. విద్యుత్ ఉద్యోగులను చర్చలకు పిలుస్తూనే వారిపై ఉక్కుపాదం మోపుతోంది. అందులో భాగంగా ఉద్యోగులకు సెలవులను రద్దుచేసింది. ఇప్పటికే సెలవులో ఉన్నవారంతా తక్షణమే విధుల్లో చేరాలని హుకుం జారీచేసింది. అత్యవసరమైతే.. ఉన్నతాధికారుల అనుమతిపత్రం తీసుకోవాలని, లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
బెదిరిస్తే నిరవధిక సమ్మె..
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఇవ్వాల్సిన నాలుగు డీఏ బకాయిలను విడుదల చేయాలని, పీఆర్సీ ప్రకటించాలని, ఐఆర్ ఇవ్వాలని, కాంట్రాక్టు కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా మార్చాలని, ఎనర్జీ అసిస్టెంట్లను జూనియర్ లైన్‌మెన్లుగా గుర్తించాలని, పింఛన్ విధానాన్ని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) కొంతకాలం కిందట ఆందోళనకు శ్రీకారం చుట్టింది.
పలు దఫాలుగా ప్రభుత్వానికి, యాజమాన్యానికి వినతిపత్రాలు ఇచ్చినా ప్రయోజనం కనిపించలేదు. దీంతో ఈ నెల 15 వరకు గడువు ఇచ్చి, అప్పటికీ స్పందించకపోతే నిరవధిక సమ్మె చేపడతామని నోటీసు ఇచ్చింది. దీంతో బుధవారం (నేడు) విజయవాడలోని విద్యుత్ భవన్‌లో చర్చలకు రావాలని ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే అంతకుముందే ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసే చర్యలు చేపట్టింది. జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో.. ఉద్యోగులంతా సెలవులను రద్దుచేసుకుని విధులకు హాజరుకావాలంటూ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు ఆదేశాలు జారీచేశారు.
మెడికల్ ఎమర్జెన్సీ వస్తే తప్ప ఎవరికీ సెలవులు ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. ఎవరైనా హెడ్‌క్వార్టర్ దాటి వెళ్లాలంటే ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. కార్పొరేట్ కార్యాలయాల్లో, జిల్లా కేంద్రాల్లో పనిచేసే శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులు తప్పనిసరిగా కార్యాలయానికి రావాల్సిందేనని తెలిపారు.
ఇందుకోసం ప్రత్యేక నమూనా హాజరుపట్టీలో వారి హాజరు నమోదుచేసి రోజూ సీఎండీ కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. దీనిపై ఉద్యోగసంఘాలు మండిపడుతున్నాయి. తమను బెదిరించి ఆందోళనలను విరమింపజేయాలని ప్రయత్నిస్తే వెంటనే నిరవధిక సమ్మెలోకి వెళతామని జేఏసీ హెచ్చరించింది.


