
శ్రీసిద్ధి భైరవేశ్వరస్వామి ఆలయ వ్యవహారాల్లో పోలీసుల జోక్యం
సాక్షి, అమరావతి: హైకోర్టు ఆగ్రహం, ఆదేశాలను పట్టించుకోకుండా పోలీసులు గ్రామస్థాయి మొదలుకుని రాష్ట్ర స్థాయి వరకు అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకే నడుచుకుంటున్నారన్న విషయం పలు దఫాలు స్పష్టమవుతూనే ఉంది. ప్రకాశం జిల్లాలో పేరుగాంచిన శ్రీసిద్ధి భైరవేశ్వరస్వామి ఆలయం ఇందుకు తాజా ఉదాహరణ. గత మూడు దశాబ్దాలుగా ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేసిన కమిటీ పగ్గాలను కూటమి నేతలు బలవంతంగా లాక్కున్నారు. గుడి తాళాలు, హుండీలు పగలగొట్టారు.
ఈ ఘటనపై వాస్తవ కమిటీ ప్రెసిడెంట్ శ్రీరంగారెడ్డి ఈ ఏడాది జూన్ 19న ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. పైపెచ్చు ఫిర్యాదును ఉపసంహరించుకోవాలంటూ శ్రీరంగారెడ్డినే వేధించడం మొదలుపెట్టారు. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై శ్రీరంగారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన హైకోర్టు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రాచర్ల పోలీసులను ఆదేశించింది. అయినా రాచర్ల పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. హైకోర్టు ఆదేశాల కన్నా అధికార పార్టీ ఎమ్మెల్యే మాటకే పోలీసులు విలువిస్తున్నారు.
కోర్టు ధిక్కార పిటిషన్‌ల దాఖలు వరకూ పరిస్థితి..
దేవస్థానం వ్యవహారాల్లో జోక్యం వద్దని హైకోర్టు ఆదేశించినా వాటిని అమలు చేయకపోవడంతో, శ్రీరంగారెడ్డి రాచర్ల ఏఎస్‌ఐ వై. ఆదిశేషయ్యపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఏఎస్‌ఐకు నోటీసులు జారీ అయ్యాయి. అలాగే, ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయాలని ఇచ్చిన హైకోర్టు ఆదేశాలను అమలు చేయలేదన్న కారణంగా, ప్రకాశం జిల్లా ఎస్‌పీ హర్షవర్ధన్‌రాజు, డీఎస్‌పీ డాక్టర్ యు. నాగరాజు, రాచర్ల ఎస్‌హెచ్‌వో పి. కోటేశ్వరరావులపై మరో ధిక్కార పిటిషన్ కూడా ఆయన దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై హైకోర్టు వచ్చే వారం విచారణ చేపట్టే వీలుంది.
మరో కుట్రకు శ్రీకారం
కోర్టు ధిక్కరణ పిటిషన్లు విచారణకు వస్తున్న తరుణంలోనే శ్రీరంగారెడ్డి, ఆయన సోదరుడు నెమిలిరెడ్డిని లక్ష్యంగా చేసుకుంటూ రాచర్ల పోలీసులు తాజాగా కేసు నమోదు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దేవస్థానానికి సంబంధించిన ఆభరణాలను తీసుకున్నారన్నది ఈ కేసు సారాంశం.