ఆరోగ్యశ్రీ ‘ఆశ’కు గండి | AP Specialty Hospitals Association suspends medical services | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీ ‘ఆశ’కు గండి

Oct 11 2025 5:30 AM | Updated on Oct 11 2025 5:30 AM

AP Specialty Hospitals Association suspends medical services

సేవలు నిలిపివేసిన ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్‌ 

చంద్రబాబు సర్కారు పేర్చిన బకాయిలతో విసిగివేసారి నిర్ణయం   

రూ.మూడువేల కోట్లకుపైగా బకాయిలు పెట్టిన కూటమి సర్కారు  

సేవలు నిలిచిపోవడంతో పేద, మధ్యతరగతి రోగుల హాహాకారాలు   

పట్టించుకోకుండా చోద్యం చూస్తున్న సీఎం చంద్రబాబు 

సాక్షి, అమరావతి/నెట్‌వర్క్‌: చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. బిల్లులు చెల్లించండి మహాప్రభో అని పదే పదే వేడుకున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు శుక్రవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలను పూర్తి స్థాయిలో నిలిపేశాయి. ‘ప్రభుత్వం రూ. మూడువేల కోట్లకుపైగా బకాయి పెట్టింది. ఒక్కో ఆస్పత్రి రూ.రెండు కోట్ల నుంచి రూ.5 కోట్ల మేర అప్పుల్లో ఉన్నాయి. అప్పులు, వడ్డీ భారం పెరిగిపోయింది. 

ఈ పరిస్థితుల్లో ఉచిత వైద్య సేవలు అందించలేం.’ అంటూ అన్ని ఆస్పత్రుల వద్ద ప్లెక్సీలు పెట్టారు. చికిత్సల కోసం ఆరోగ్యశ్రీ కార్డుతో ఆస్పత్రులకు వెళ్లిన బాధితులకు ఉచిత చికిత్సలు అందించబోమని, డబ్బు కడితే వైద్యం చేస్తామని యాజమాన్యాలు తేల్చి చెప్పాయి. దీంతో అనారోగ్యం బారినపడ్డ పేద, మధ్యతరగతి ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. 

చోద్యం చూస్తున్న బాబు 
ఆరోగ్యశ్రీ వైద్య సేవలకు సంబంధించి రూ.3వేల కోట్లకు పైగా ప్రభుత్వం నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బకాయి పడింది. బకాయిలు విడుదల చేయాలని గత కొద్ది నెలలుగా ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని ప్రాధేయపడుతూ వస్తున్నాయి. ఉన్నతాధికారులతోపాటు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి, సీఎం ఇలా ఎంత మందిని కలిసిన ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో గత నెల 15నే ప్రభుత్వానికి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌(ఆశ) సమ్మె నోటీస్‌ ఇచ్చింది. 

అదే రోజు నుంచే ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత ఓపీ, డయగ్నొస్టిక్‌ సేవలను నిలిపివేసింది. అయినప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోవడంతో ఈనెల 10వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో సేవలు ఆపేస్తామని గత నెల 24నే ప్రభుత్వాన్ని ఆశ ప్రతినిధులు హెచ్చరించారు. అయినా సర్కారులో చలనం లేకపోయింది.  

ఆరునెలల వ్యవధిలో ఇది రెండోసారి 
ఎంతగా మొత్తుకున్నా.. కూటమి సర్కారు కనీసం స్పందించకపోవడంతో విసిగివేసారిన నెట్‌వర్క్‌ ఆస్పత్రుల యజమాన్యాలు చేసేదిలేక శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలను  నిలిపివేశాయి. కొత్త కేసులను అడ్మిట్‌ చేసుకోలేదు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సలు పొందిన వారికి ఫాలోఅప్‌ సేవలనూ ఆపేశారు. అనంతపురం జిల్లాలో 28, తూర్పుగోదావరి 31, గుంటూరు 26, కాకినాడ 26, కర్నూలు 30, నంద్యాల 23, పల్నాడు 35, వైఎస్సార్‌ 28, పశ్చిమగోదావరి జిల్లాలో 26, విశాఖ జిల్లాలో 63, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 10, ఎన్టీఆర్, కృష్ణాజిల్లాల్లో 10, వైఎస్సార్‌ కడప జిల్లాలో 14 ప్రైవేట్‌ ఆస్పత్రులు సమ్మెలోకి వెళ్లాయి. 

మిగిలిన జిల్లాల్లోనూ భారీగా ఆస్పత్రులు సమ్మెలోకి వెళ్లాయి. ఆరోగ్యశ్రీ సేవలు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో నిలిచిపోవడం ఆరు నెలల వ్యవధిలోనే ఇది రెండోసారి. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలోనూ ఇదే తరహాలో నెట్‌వర్క్‌ ఆస్పత్రులు సమ్మెలోకి వెళ్లాయి. అప్పట్లో సీఎం నేరుగా యజమానులతో చర్చించి బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. సీఎం ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరకపోవడంతో ఆస్పత్రుల యజమానులు మళ్లీ సమ్మెలోకి వెళ్లారు.

గత పాలనలో ఆరోగ్యశ్రీ బలోపేతం  
2014–19 మధ్య ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించింది. 2019లో టీడీపీ దిగిపోయే నాటికి రూ.700 కోట్లకుపైగా బకాయి పెట్టింది. తన బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నడిపే బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రికి సైతం బకాయిలు పెట్టి అప్పట్లో చంద్రబాబు దిగిపోయారు. ఈ పెండింగ్‌ బకాయిలన్నింటినీ ఆ తర్వాత అధికారం చేపట్టిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చెల్లించింది.  2019–24 మధ్య ఆరోగ్యశ్రీకి మళ్లీ ఊపిరులూదింది. విప్లవాత్మక సంస్కరణలతో పునరుజ్జీవం పోసి బలోపేతం చేసింది. 

రూ. ఐదు లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న వారందరినీ పథకం పరిధిలోకి తెచ్చి మధ్యతరగతి వారికి ఆరోగ్య భరోసా కల్పించింది. వైద్య ఖర్చుల పరిమితిని రూ.25 లక్షలకు పెంచింది. 1,059 ప్రొసీజర్లను 3,257కి పెంచింది. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తోంది. పథకాన్ని అస్తవ్యస్తం చేసింది. భారీగా బకాయిలు పెండింగ్‌ పెట్టడంతో నెట్‌వర్క్‌ ఆస్పత్రులు సమ్మె చేయాల్సిన గడ్డు పరిస్థితిని తీసుకొచ్చింది.   

అకస్మాత్తుగా గుండెపోటు.. ఒక్కరోజే రూ.లక్షన్నర ఖర్చు  
గుంటూరుజిల్లా పొన్నూరు నియోజకవర్గానికి చెందిన 48 ఏళ్ల  సుబ్బారావుకు శుక్రవారం అకస్మాత్తుగా గుండె పోటు రావటంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గుంటూరు కొత్తపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడంతో రోగుల బంధువులు ఇబ్బంది పడ్డారు. డబ్బులు చెల్లిస్తే వైద్యసేవలు అందిస్తామని సిబ్బంది చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన్ని ఆస్పత్రిలో చేర్చారు. 

ఒక్కరోజులోనే సుబ్బారావు వైద్యానికి రూ.లక్షన్నర ఖర్చుచేశారు. ఒక్క ఇంజక్షన్‌కే రూ.50వేలు చెల్లించినట్టు సుబ్బారావు కుటుంబ సభ్యులు తెలిపారు. తాపీ పనిచేసుకుని జీవించే తమ కుటుంబం ఇంత ఖర్చు భరించే స్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆరోగ్యశ్రీ అమలయ్యేలా చూడాలని కోరారు.   

అప్పు చేసి పాపకు వైద్యం   
ఈమె పేరు చెల్లమ్మ. ఊరు తిరుపతి జిల్లా సత్యవేడు. ఈమె కుమార్తెకు ఇటీవల తిరుపతిలోని ప్రైవేటు ఆస్పత్రిలో వెన్నెముక ఆపరేషన్‌ చేశారు. మళ్లీ వైద్య పరీక్షల నిమిత్తం శుక్రవారం సత్యవేడు నుంచి కుమార్తెను తీసుకు వచ్చారు. ఆస్పత్రికి వచ్చాక ఆరోగ్యశ్రీ కింద చికత్స చేయడం లేదని సిబ్బంది సమాధానం చెప్పారు. చేసేది లేక తెలిసిన వారి వద్ద రూ.5వేలు అప్పుచేసి పాపకు వైద్యం చేయించారు. ఆరోగ్యశ్రీ ఉంటే ఈ భారం తగ్గేదని పేర్కొంటున్నారు. ప్రభుత్వం తక్షణం ఆరోగ్యశ్రీ అమలయ్యేలా చూడాలని కోరుతున్నారు.

డబ్బు చెల్లించి శుక్లం ఆపరేషన్‌ చేయించుకుంటున్నా  
నా పేరు కాటమ్మ, నంద్యాల జిల్లాలోని సంజామల మండలం, పేరుసోముల గ్రామం నుంచి వచ్చాను. గతంలో ఒక కంటికి శుక్లం ఆపరేషన్‌ చేయించుకున్నాను. రెండో కన్ను కూడా చూపు మందగించడంతో ఆపరేషన్‌ చేయించుకోవడానికి వచ్చాను. 

ప్రొద్దుటూరులోని ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్తే అక్కడ ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్‌ చేయబోమని చెప్పారు. దీంతో డబ్బులు చెల్లించి ఆపరేషన్‌ చేయించుకుంటున్నాను. రెక్కాడితేగానీ డొక్కాడని పేదలం. డబ్బులు కట్టి ఆపరేషన్‌ చేయించుకోవాలంటే కష్టంగానే ఉంది. కానీ తప్పట్లేదు. ప్రభుత్వం స్పందించాలి.  – కాటమ్మ, పేరుసోముల, సంజామల మండలం, నంద్యాల జిల్లా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement