
మూడు చోట్ల పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధి
‘లిఫ్ట్ పాలసీ’ సవరణకు ఆమోదం
పలు సంస్థలకు రాయితీలు, భూములు కేటాయింపునకు కేబినెట్ ఆమోదం
ఉద్యోగుల డీఏపై కేబినెట్ సమావేశంలో చర్చే జరగలేదని వెల్లడించిన మంత్రి పార్ధసారథి
సాక్షి, అమరావతి: ఏపీఐఐసీ అనుబంధ సంస్థ రాష్ట్ర ప్రాజెక్టుల అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా హడ్కో నుంచి 8.6 శాతం వడ్డీతో తీసుకున్న రూ.5,000 కోట్ల రుణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిధులతో కర్నూలు జిల్లా ఓర్వకల్లు, వైఎస్సార్ కడప జిల్లా కొప్పర్తి, ప్రకాశం జిల్లా పామూరులో పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కె.పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన ‘డీఏ’ గురించి విలేకరులు ప్రస్తావించగా.. అసలు ఆ అంశంపై కేబినెట్ సమావేశంలో చర్చే జరగలేదని, దీనిపై తనకు అవగాహన లేదని మంత్రి బదులిచ్చారు. మంత్రివర్గ సమావేశం నిర్ణయాలిలా...
» రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘లిఫ్ట్ పాలసీ’ సవరణకు ఆమోదం. ఎకరం రూ.4 కోట్ల చొప్పున అర ఎకరం నుంచి నాలుగు ఎకరాల వరకు కేటాయించేలా సవరణలు. భూములు కేటాయించిన నాటి నుంచి 12 నెలల్లో వర్కింగ్ స్టేషన్ల నిర్మాణం పూర్తి చేసి మరో 12 నెలల్లో 500 మందికి ఉద్యోగాలు కల్పించాలి.
» ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ రూల్స్ 1984 నిబంధన (5)కు అనుగుణంగా ఏఎస్‌ఆర్ జిల్లా వై.రామవరం మండలం రంపచోడవరం డివిజన్‌ను గుర్తేడు, వై.రామవరం మండలాలుగా విభజిస్తూ నోటిఫికేషన్ జారీకి రెవెన్యూ శాఖ ప్రతిపాదనకు ఆమోదం. 59 గ్రామాలతో గుర్తేడు, 78 గ్రామాలతో వై.రామవరం మండల కేంద్రాలుగా ఏర్పాటు కానున్నాయి.
» అమరావతిలో గవర్నర్ నివాసం, దర్బార్ హాల్ నిర్మాణాన్ని రూ.212.22 కోట్లతో చేపట్టేందుకు పరిపాలన అనుమతికి ఆమోదం. సీఆర్‌డీఏ అథారిటీ ఇప్పటికే కన్వెన్షన్ కేంద్రాల కోసం 2.5 ఎకరాలు కేటాయించగా అదనంగా మరో నాలుగు ఎకరాలు కేటాయించి నిర్మాణాలను చేపట్టేందుకు అనుమతి.