
ప్రకటించిన విద్యుత్ ఉద్యోగుల జేఏసీ
ప్రభుత్వంతో చర్చలు విఫలం
ఒక్క సమస్య పరిష్కారానికీ అంగీకరించని కూటమి సర్కారు
అసలు నోటీసే ఇవ్వని టీఎన్‌టీయూసీతో ముందస్తు చర్చలు
స్టీరింగ్ కమిటీతో ఆందోళనలను పక్కదారిపట్టించే యత్నం
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)తో విద్యుత్ సంస్థల యాజమాన్యాలు బుధవారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఈ నెల 15 నుంచి నిరవధిక సమ్మె అనివార్యమని జేఏసీ ప్రకటించింది. రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగుల ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో జేఏసీ నేతలను మూడు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు), ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో యాజమాన్యాలు చర్చలకు ఆహ్వానించాయి. విద్యుత్ ఉద్యోగుల స్టీరింగ్ కమిటీ చైర్మన్ (జెన్‌కో ఎండీ, ట్రాన్స్‌కో జేఏండీ) ఎస్.నాగలక్ష్మి, సభ్యులు ఐ.పృధ్వీతేజ్ (ఏపీఈపీడీసీఎల్ సీఎండీ), కె.సంతోష్ రావు (ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ), విద్యుత్ సంస్థల డైరెక్టర్లు బుధవారం విజయవాడలోని విద్యుత్ సౌధలో జేఏసీతో చర్చలు జరిపారు.
జేఏసీ తరఫున హాజరైన నాయకులు తమ ఉద్యమ కార్యాచరణ షెడ్యూల్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై కమిటీకి స్పష్టంగా వివరించారు. అయితే దాదాపు 29 ప్రధాన డిమాండ్లపై చర్చ జరిగినప్పటికీ, యాజమాన్యం వైఖరి పూర్తి వ్యతిరేకంగా ఉండటంతో చర్చలు ఫలించలేదు. ఒక్క డిమాండ్‌పైన కూడా పరిష్కారదిశగా ముందడుగు వేయలేదని జేఏసీ నాయకులు తెలిపారు. యాజమాన్యం ప్రస్తావించిన అంశాలను విన్న అనంతరం జేఏసీ నాయకులు చర్చలు ఫలించలేదని ప్రకటిస్తూ సమావేశం నుంచి బయటకు వచ్చారు.
తరువాత 1104 సంఘం కార్యాలయంలో అత్యవసరంగా సమావేశమైన జేఏసీ నాయకులు పరిస్థితిని సమీక్షించి, ‘ఇప్పుడిక సమ్మె తప్ప మరోమార్గం లేదు’ అని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ సమావేశంలో జేఏసీ చైర్మన్ ఎస్.కృష్ణయ్య, కన్వినర్ రాఘవరెడ్డి, కో–చైర్మన్ కె.వి.శేషారెడ్డి, 1104 సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాలరావు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పి.శివయ్య, ఓసీ అసోసియేషన్ నాయకుడు కె.శ్రీనివాసు, 1535 సంఘం నాయకుడు అన్నే శ్రీనివాసకుమార్, జేఏసీ నేతలు బుక్కే నాగేశ్వరనాయక్, అంజయ్య, జి.కె. వీరభద్రయ్య పాల్గొన్నారు.
ఎందుకు పిలిచినట్లు?
విద్యుత్ ఉద్యోగులు ఆందోళనలపై రాష్ట్ర ప్రభుత్వం ముందునుంచి ఉదాసీనవైఖరినే అవలంభిస్తోంది. ఉద్యోగులతో నేరుగా సంప్రదింపులు, చర్చలు జరపకుండా విద్యుత్ సంస్థల సీఎండీలతోనే స్టీరింగ్ కమిటీని వేయడం ద్వారా ఉద్యోగుల ఆందోళనలను నిర్వీర్యం చేయాలనే వ్యూహం రచించింది. కమిటీ చైర్మన్ ఇటీవలే ఏపీ జెన్‌కో ఎండీగా బాధ్యతలు చేపట్టారు. చర్చల సందర్భంగా కూడా తాము ఇటీవలే కొత్తగా వచ్చినందున ఉద్యోగుల సమస్యలపై అధ్యయనం చేయడానికి కొంత సమయం కావాలని కమిటీ చెప్పడం విడ్డూరంగా ఉందని జేఏసీ పేర్కొంటోంది.
ఉదయం 11 గంటలకు జేఏసీని చర్చలకు పిలిచిన యాజమాన్యాలు ఉదయం 10 గంటలకే, అంటే గంట ముందు టీడీపీ అనుబంధసంఘం టీఎన్‌టీయూసీ నేతలను చర్చలకు పిలిచాయి. ఆ యూనియన్ ఇప్పటివరకు ఉద్యోగుల తరఫున ఎలాంటి ఆందోళన చేపట్టలేదు. సమ్మె నోటీసు కూడా ఇవ్వలేదు. అయినా ఆ యూనియన్‌కు తొలి ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం ఏమిటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
టీఎన్‌టీయూసీతో చర్చల అనంతరం వెళ్లిన జేఏసీ నేతలు ప్రస్తావించిన ప్రతి సమస్యపైనా కమిటీ సభ్యలు ‘డిఫర్’ అనే పదం తప్ప మరో పదం వాడకపోవడం మరో విశేషం. రాష్ట్ర ప్రభుత్వానికి తమ సమస్యల పరిష్కారం పట్ల కనీస చిత్తశుద్ధి లేదనేది ఈ చర్యలతో, చర్చలతో తేలిపోయిందని, ఇక నిరవధిక సమ్మె తప్పదని జేఏసీ నేతలు పేర్కొన్నారు.
కదం తొక్కిన విద్యుత్ ఉద్యోగులు..!
తిరుపతిలో విద్యుత్ శాఖ ఉద్యోగులు కదం తొక్కారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చేసిన మోసం.. విద్యుత్ సంస్థలు చూపించే నిర్లక్ష్యంపై విద్యుత్ ఉద్యోగ సంఘాలు, కాంట్రాక్టు కార్మిక సంఘాలు ఏకమై ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమయ్యాయి. తిరుపతి వేదికగా బుధవారం జరిగిన ఏపీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వద్ద వేలాది మంది ఉద్యోగులు ఇలా రోడ్డుపై బారులు తీరారు. – తిరుపతి రూరల్