సాక్షి, విజయవాడ: నకిలీ మద్యం కేసు(AP Fake Liquor Case) దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. మంగళగిరి ఎక్సైజ్ కార్యాలయంలో ప్రధాన నిందితుడు జనార్దన్ రావును అధికాలు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో.. టీడీపీ నేతల డొంక కదులుతున్నట్లు సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులో ఏ-1 నిందితుడు అద్దెపల్లి జనార్దనరావును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నాటకీయ పరిణామాల నడుమ.. శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో ఎన్టీఆర్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ టాస్క్‌ఫోర్స్ (ఈస్‌టీఎఫ్) సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అయితే..
విచారణలో జనార్దన్‌రావు ఇప్పటిదాకా కీలక వివరాలనుఏ వెల్లడించినట్లు తెలుస్తోంది. మొలకల చెరువు, ఇబ్రహీంపట్నం, భవాని పురం, పరవాడ, తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం డెన్‌లు ఉన్నట్లు జనార్దన్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో పలు చోట్ల విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాలు జరుపుతున్నారు.
ఏలూరు, రాజమండ్రి, విజయవాడతో పాటు విశాఖలో పాత నేరస్తుడు వెంకట్‌కు చెందిన స్థావరంలోనూ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో.. శ్రీకాకుళంలోని సారవకోట మండలంలో, ఇంకోవైపు అనకాపల్లి పాయకరావుపేట హైవేలోని పలు ట్రేడర్స్‌లోనూ తనిఖీలు జరుగుతుండడం కలకలం రేపుతోంది. ఈ సోదాలతో నకిలీ మద్యం మాఫియా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిందనేది స్పష్టమవుతోంది.
జనార్ధన్ రావు నోరు విప్పితే టీడీపీ నేతల పేర్లు బయటకు వస్తాయి. ఈ క్రమంలో నకిలీ మద్యం తయారీ ప్రధాన సూత్రదారులలో మొదలైన భయం మొదలైంది. జనార్ధన్ రావు నీ ఏ కోర్టులో హాజరుపరుస్తారో అని ఆరా తీస్తున్నట్లు సమాచారం.
మొత్తానికి నకిలీ మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని కూటమి ప్రభుత్వం ప్రమాదంలో పడేయగా.. ఈ కేసు నుంచి ఎలాగైనా బయటపడాలని టీడీపీ బడా నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
నకిలీ మద్యం సొమ్ముతో..
నకిలీ మద్యం అమ్మకాలలో వచ్చిన డబ్బులతో నిందితులు భూములు కొనుగోలు చేసినట్లు తేలింది. ఈ కేసులో A12 నిందితుడైన కళ్యాణ్.. జనార్దన్ రావు పిన్ని కొడుకు. ఈ మధ్యకాలంలో కళ్యాణ్ గొల్లపూడిలో రూ.3 కోట్ల విలువైన ల్యాండ్‌ను కొనుగోలు చేశాడు. అది నకిలీ మద్యం సొమ్మేనని పోలీసులు నిర్ధారించుకున్నారు.
అంతేకాదు.. ఇబ్రహీంపట్నం డెన్‌లో తనిఖీల సమయంలో కళ్యాణ్ సుమారు 60 కేసుల నకిలీ మద్యాన్ని బాత్రూంలో పారబోసినట్టు గుర్తించారు. జనార్ధన్ రావు పూర్తిగా నోరు విప్పితే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
స్కెచ్ ఎలా ఉందంటే..
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నకిలీ మద్యం తయారీకి టీడీపీ నేతలు స్కెచ్ వేసినట్లు స్పష్టమవుతోంది. వాళ్లలో కొందరు కొందరు అధికార బలంతో గుట్టు చప్పుడు కాకుండా నకిలీ మద్యం తయారీ యూనిట్లు మొదలు పెట్టారు. ఈ క్రమంలో.. ములుకల చెరువు, ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం డెన్‌లను జనార్దన్ రావు(TDP Janardhan Rao) నేతృత్వంలో ఏర్పాటు చేసినట్లు తేలింది.
బెల్ట్ షాపులుతో మొదలు పెట్టి.. వైన్స్, బార్ల షాపులలో నకిలీ మద్యం అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. అదే సమయంలో.. మరో టీడీపీ నేత జయ చంద్రారెడ్డికి జనార్ధన్ రావుకి మద్య ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించినట్లు సమాచారం.
రాష్ట్రంలో దొరికిన ప్రతి నకిలీ మద్యం డెన్ మూలాలు జనార్ధన్ రావు వైపు చూపిస్తున్నట్టు గుర్తించిన ఎక్సైజ్ అధికారులు.. ఆయన్ని సుదీర్ఘంగా ప్రశ్నించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: నకిలీ మద్యంపై కదం తొక్కిన మహిళలు



