
భారీ ర్యాలీ, మద్యాన్ని పారపోసి నిరసన
ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్‌కు వినతి పత్రం
కడప కార్పొరేషన్/ఏలూరు టౌన్: నకిలీ మద్యంతో ప్రాణాలు తీస్తున్న కూటమి ప్రభుత్వంపై మహిళలు కదం తొక్కారు. ఎన్–బ్రాండ్ లిక్కర్‌ను అరికట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, నగర అధ్యక్షురాలు బండి దీప్తి ఆధ్వర్యంలో కడపలోని ప్రకాష్ నగర్ మెయిన్ రోడ్డులో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట మద్యం పారబోసి నిరసన తెలిపారు. అనంతరం అసిస్టెంట్ సూపరింటెండెంట్ వినోద్ కుమార్ నాయక్‌కు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ మాట్లాడుతూ ప్రజలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్టుషాపులు విచ్చలవిడిగా ఉన్నాయని, నకిలీ మద్యం ఎక్కడపడితే అక్కడే దొరుకుతోందన్నారు. ఇప్పటికే నకిలీ మద్యానికి నలుగురు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ మద్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, బాధ్యులైపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఏలూరులో..
రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, వీధివీధిలో బెల్టు షాపులు పెట్టి ప్రజలను మద్యానికి బానిసలుగా మారుస్తూ ప్రజల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు కేసరి సరితారెడ్డి మండిపడ్డారు. ఏలూరు న్యూ అశోక్‌నగర్‌లోని ఎక్సైజ్ శాఖ డీసీ కార్యాలయం వద్ద శుక్రవారం వైఎస్సార్‌సీపీ మహిళా నేతలతో భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం చంద్రబాబు ఫ్లెక్సీకి మద్యంతో అభిõÙకం చేసి నినాదాలు చేశారు.