
15 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని స్పష్టం చేసిన విద్యుత్ జేఏసీ
అయినా ఉద్యోగుల సమస్యలపై స్పందించని కూటమి ప్రభుత్వం
నేడు ‘చలో విజయవాడ’ పేరుతో మహాధర్నాకు ఉద్యోగులు సిద్ధం
జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే సన్నాహక సమావేశాలు, భారీ ర్యాలీలు, సభలు
డిమాండ్లు నెరవేర్చేవరకూ పోరాడతామంటున్న ఉద్యోగ సంఘాల నేతలు
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగులు దాదాపు 63వేల మంది తమ సమస్యలను పరిష్కరించకుంటే ఈ నెల 15వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరిస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టంచేస్తున్నారు. సోమవారం ‘చలో విజయవాడ’ పేరుతో రాష్ట్రం నలుమూలల నుంచి విద్యుత్ ఉద్యోగులు విజయవాడ ధర్నా చౌక్‌కు చేరుకుని మహాధర్నా చేపట్టనున్నారు. బుధవారం ఉదయం 6గంటల నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించనున్నారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు, సభలు, సమావేశాలు, ధర్నాలు నిర్వహించి సమ్మెకు సిద్ధమయ్యారు. దీంతో ఉద్యమ వాతావరణం వేడెక్కింది. కాగా, సోమవారం సాయంత్రం ఐదు గంటలకు విజయవాడలోని విద్యుత్ సౌధలో చర్చలకు రావాలని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ, యూనియన్ల నాయకులకు యాజమాన్యం సమాచారం పంపింది.
ఎన్ని అడ్డంకులు సృష్టించినా తగ్గేదేలేదు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. అయినప్పటికీ విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విచారకరం. అందువల్లే దశలవారీ ఆందోళనల నుంచి నిరవధిక సమ్మె వరకూ రావాల్సి వచ్చింది. శాశ్వత ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించే వరకూ ఉద్యమాన్ని ఆపేదేలేదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తగ్గేదేలేదు. – ఎస్.కృష్ణయ్య, అధ్యక్షుడు, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ
న్యాయంగా రావాల్సినవే అడుగుతున్నాం
విద్యుత్ ఉద్యోగుల ప్రాణాలకు గ్యారెంటీ లేదు. ఎప్పుడు ఏ ప్రమాదం బారిన పడతామో తెలియదు. అలాంటి ఉద్యోగంలో ఉన్న మాకు న్యాయంగా రావాల్సినవే మేం అడుగుతున్నాం. మా డిమాండ్లలో చాలా వాటికి ఇప్పటికే యాజమాన్యాలు అనేక సమావేశాల్లో అంగీకరించాయి. కానీ ఇంతవరకూ అమలు చేయలేదు. వాటిని అమలు చేయాలని అడుగుతుంటే మొండివైఖరి అవలంబిస్తున్నారు. – కె.శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ
న్యాయం జరిగే వరకు పోరాడతాం
వన్ ఇండస్ట్రీ–వన్ సర్వీస్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేసి గ్రేడ్–2 కార్మికులకు న్యాయం చేసే వరకూ మా పోరాటం కొనసాగుతుంది. కారుణ్య నియామకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని నివారించాలి. నగదు రహిత అపరిమిత మెడికల్ పాలసీని వర్తింపజేయాలి. – డి.వెంకటేశ్వరరావు, ఎల్.రాజు, ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ నాయకులు
విలీనం చేసి నేరుగా జీతాలివ్వాలి
కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ కార్మికులను విద్యుత్ సంస్థల్లో విలీనం చేయాలి. కాంట్రాక్టు కార్మికులకు రూ.కోటి ఇన్సూరెన్స్ చేయాలి. యాజమాన్యమే నేరుగా వేతనాలు చెల్లించాలి. అలా చేస్తే ఏటా రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్లు విద్యుత్ సంస్థలకు ఆదా అవుతాయి. – బాలకాశి, నాగార్జున, నాగరాజు, విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం నేతలు