
సాక్షి, హైదరాబాద్: శుక్రవారం మధ్యాహ్నం నుంచి దంచి కొట్టిన భారీ వర్షం.. నగరాన్ని అతలాకుతలం చేసేసింది. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో పలువురు వరద నీటిలో చిక్కుకున్నారు. కొత్తగూడ ఫ్లై ఓవర్‌పై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ను మళ్లిచారు. పలుచోట్ల ఫ్లై ఓవర్లు వాహనాలతో నిండిపోయాయి. భారీ వర్షం కారణంగా ఐటీ సెక్టార్‌లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
నగరంలో రెండు గంటలపాటు వర్షానికి ఐటీ ఏరియా అతలాకుతలమైంది. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, బయోడైవర్సిటీ, రాయదుర్గంలో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. ఈ రాత్రికి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని.. యాద్రాది, భువనగిరి జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్..
హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యంది. భారీ వర్షానికి సికిందరాబాద్‌లో ‘పైగా’ కాలనీ నీటమునిగింది. కాలనీలో ఉన్న ఇళ్లలోకి వరద నీరు భారీగా చేరింది. కొన్ని పరిశ్రమలు, షోరూమ్ ఉద్యోగులు వరద నీటిలో చిక్కుకున్నారు. అత్యధికంగా మారేడ్‌పల్లిలో 11.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. బాలానగర్ 11, ఉప్పల్‌లో 10.5, మల్కాజ్‌గిరిలో 9.7, ఇబ్రహీంపట్నంలో 9.6, బండ్లగూడలో 9.5, ముషీరాబాద్‌లో 8.9, అంబర్‌పేట్‌లో 8.4, దుండిగల్ 8.3 సెం.మీ వర్షపాతం నమోదైంది.
భారీ వర్షాలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్, విద్యుత్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని రేవంత్ సూచించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు, ఇతర విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షంతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు.
