
నేడు, రేపు కొనసాగే సూచనలు
26న అల్పపీడనం ఏర్పడే అవకాశం
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/వాకాడు: బంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు ఉన్న ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం తిరుపతిలో 7.6, చిత్తూరు జిల్లా కతేరపల్లెలో 7.3, నెల్లూరు జిల్లా దగదర్తి, 6.8, అక్కంపేటలో 5.5, కలిగిరిలో 4.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
రాయలసీమలో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శనివారం కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, ఈశాన్య బంగాళాఖాతంలో ఈ నెల 26న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఆ మరుసటి రోజుకి వాయుగుండంగా బలపడేందుకు అవకాశం ఉందని, ఆ తర్వాత ఒడిశా సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిమీ వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
ఉవ్వెత్తున ఎగసి పడుతున్న కెరటాలు..
రెండు రోజులుగా వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా శుక్రవారం సముద్ర అలలు ఉధృతంగా ఎగసిపడుతున్నాయి. బంగాళాఖాతం వెంబడి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. దీంతో తిరుపతి జిల్లా వాకాడు మండలం తూపిలిపాళెం వద్ద సముద్రంలో అలలు 7మీటర్ల ఎత్తుకు భీకరమైన శబ్దాలతో ఎగసి పడుతున్నాయి.
దీని కారణంగా సముద్ర తీరం 10 మీటర్లు వరకు ముందుకు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా పగలు సైతం రాత్రిని తలపిస్తోంది. దీంతో తీరానికి విచ్చేసిన పర్యాటకులు వెనుతిరిగుతున్నారు. వేటకు వెళ్ళిన మత్స్యకారులు ఖాళీ బోట్లతో ఒడ్డుకు చేరుకున్నారు.