సింహాచలం: సింహాచలం కొండపై ట్రాఫిక్ నిర్వహణ వైఫల్యం కలెక్టర్ పర్యటన రద్దయ్యేలా చేసింది. శుక్రవారం మధ్యాహ్నం సింహగిరికి బయలుదేరిన కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్.. ఘాట్ రోడ్డులో సుమారు గంటసేపు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. ఎంతకీ ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో ఆయన తీవ్ర అసహనంతో సగంలోనే వెనుదిరిగారు. సింహగిరిపై జరుగుతున్న ప్రసాద్ పథకం పనులు, లడ్డూ ప్రసాదాల నాణ్యత, పారిశుధ్య నిర్వహణతో పాటు ఈనెల 30న జరగనున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించేందుకు కలెక్టర్ ఈ పర్యటన తలపెట్టారు.
అయితే, ఘాట్ రోడ్డు ప్రవేశద్వారం నుంచే ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ఆయన వాహనం ముందుకు కదలలేకపోయింది. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా దేవస్థానం ఇన్‌చార్జి ఈవో ఎన్. సుజాతకు ఫోన్ చేసి.. ట్రాఫిక్ పోలీసులు, దేవస్థానం సిబ్బంది పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. గత కొద్దిరోజులుగా సింహగిరి ఘాట్ రోడ్డు, లోవ తోట నుంచి రాజగోపురం వరకు ట్రాఫిక్ పెద్ద ఎత్తున స్తంభిస్తోంది. వాహనాల పార్కింగ్‌కు సరైన దిశానిర్దేశం లేకపోవడం, పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించకపోవడంతో భక్తులు, వాహనదారులు గంటల తరబడి నరకయాతన అనుభవిస్తున్నారు.


