నగరంలోని ఆర్‌కే బీచ్ అందాలను చూస్తూ నొవోటెల్ హోటల్‌లో నలుగురు సభ్యులున్న ఒక కుటుంబం ఒక రోజు బస చేసేందుకు చెల్లించాల్సిన అద్దె ఎంతో తెలుసా.. రూ.28,179 వేలు!
బీచ్‌కు కొద్దిగా దూరంలోనైనా ఫర్వాలేదు అనుకుని ఫోర్ పాయింట్స్ హోటల్‌కి వెళ్తే రూ.18 వేలకుపైగానే చెల్లించాల్సి వస్తోంది.
విమానాశ్రయం దగ్గరలోని మారియెట్ హోటల్‌లో అయితే రూ.17 వేలపైమాటే పలుకుతోంది. దీనికి పన్నులు అదనం!
ఇవే కాదు డాల్ఫిన్, దసపల్లా, పార్క్ హోటల్, గ్రీన్‌పార్క్, ఐటీసీ.. ఇలా ఏ హోటల్‌లో చూసినా ఆకాశాన్ని అంటే ధరలే దర్శనమిస్తున్నాయి. కొన్ని హోటల్స్‌లో అయితే కొత్త ఏడాది జనవరి 3వ తేదీ వరకూ ఇప్పటికే నో వెకెన్సీ బోర్డులు పెట్టేశారు.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కొత్త ఏడాది సంబరాలు.. హోటల్స్‌కు సిరులు కురిపిస్తున్నాయి. నగరంలోని త్రీస్టార్, ఫోర్ స్టార్, ఫైవ్ స్టార్ హోటల్స్‌లోని గదులన్నీ దాదాపు బుక్ అయిపోయాయి. కొన్ని రూమ్స్ ఖాళీగా ఉన్నా వాటి చార్జీలు చుక్కలంటుతున్నాయి. మామూలు రోజులతో పోలి్చతే స్టార్ హోటల్స్ అన్నీ రూమ్ చార్జీలను భారీగా పెంచేశాయి. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ బీచ్ అందాలను చూస్తూ ఎంజాయ్ చేద్దామని విశాఖ వచ్చే పర్యాటకుల జేబులు చిల్లుపడనుంది. ఒక కుటుంబం కేవలం హోటల్ అద్దెకు రూ.15 వేల నుంచి రూ. 20 వరకూ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్టార్ హోటల్స్ కాకుండా తర్వాతి రేంజ్ హోటల్స్ చూద్దామనుకుంటే హౌస్ ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి.
సీజన్ కావడంతో..!
సాధారణంగా విశాఖపట్నంలో ఏడాది పొడవునా ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంటుంది. ప్రైవేటు సంస్థలు ఏర్పాటు చేసుకునే సెమినార్లతో పాటు నగరంలో ఉన్న ప్రభుత్వ సంస్థలు కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాలతో హోటల్స్‌కు గిరాకీ బాగానే ఉంటుంది. వీటితో పాటు అక్టోబరు నుంచి ఫిబ్రవరి, మార్చి నెల మొదటి వారం వరకూ ఇక్కడ ఉండే వాతావరణం పర్యాటకులను ఆకర్షిస్తుంది. అంతేకాకుండా విశాఖ నుంచి అరకుకు వెళ్లే ప్రయాణికులందరూ నగరంలో ఒకటి రెండు రోజుల పాటు బస చేసేందుకు ఇష్టపడతారు. నగరంలోని బీచ్ అందాలతో పాటు సబ్‌మెరైన్ మ్యూజియం, కైలాసగిరి, రుషికొండ బీచ్‌తో పాటు ఎదురుగా ఉన్న టీటీడీ ఆలయం, రామానాయుడు స్టూడియో, భీమిలి తదితర ప్రాంతాలను సందర్శిస్తుంటారు. ఏడాది చివరి కావడంతో (మిగిలిన సెలవులను తీసుకొని) ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని హోటల్స్ భారీగా అద్దెలను పెంచేస్తున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే 2, 3 రెట్లు అధిక ధరలను నిర్ణయిస్తున్నాయి. ఇది పర్యాటకులకు పెను భారంగా మారుతోంది.
కట్టడి చేసేది ఎవరు..?
ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కోల్‌కత్తా వంటి ప్రాంతాల నుంచి ఉన్న భారీ డిమాండ్‌తో ప్రైవేటు ట్రావెల్స్ ఇబ్బడిముబ్బడిగా టికెట్ ధరలను పెంచేశాయి. ప్రధానంగా ఇయర్ ఎండ్, నూతన సంవత్సరం వేడుకలకు వచ్చే పర్యాటకులు.. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీతో గుల్లవుతున్నారు. ఇది చాలదన్నట్టుగా హోటల్స్ కూడా భారీగా ధరలను పెంచడంతో మరింత భారంగా మారుతోంది. స్టార్ హోటళ్లు ప్రత్యేకమైన థీమ్‌తో న్యూ ఇయర్ వేడుకలు అంటూ ఒక్కో జంటకు రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు చార్జ్ చేస్తున్నాయి. క్యాండిల్ లైట్ డిన్నర్, డీజే, ఎంటర్‌టైన్‌మెంట్, గాలా డిన్నర్, లైవ్ మ్యూజిక్, డ్యాన్స్‌లు వంటివి ఏర్పాటు చేస్తున్నాయి. చిన్నారుల కోసం ప్రత్యేకంగా మ్యాజిక్ షోలు వంటివి నిర్వహిస్తున్నాయి. వీటన్నంటికీ భారీగానే చార్జ్ చేస్తున్నాయి. ఏడాది చివరిలో కనీసం ఏదో ఒక ప్రాంతానికి కుటుంబాన్ని తీసుకెళదామనే ఆశతో రావాలని భావిస్తే ఈ అదనపు వసూళ్లు కాస్తా ఇబ్బందిగా మారుతున్నాయి. ధరలను కట్టడి చేసేందుకు ప్రత్యేకమైన యంత్రాంగం లేకపోవడంతో హోటళ్లు చెలరేగిపోతున్నాయనే విమర్శలున్నాయి.


