
బంగ్లాదేశ్ సమీపంలో తీరం దాటిన వాయుగుండం
సాక్షి, అమరావతి/సాక్షి విశాఖపట్నం: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం బంగ్లాదేశ్ సమీపంలో తీరం దాటింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి.. వాయవ్య బంగాళాఖాతం వైపుగా కదులుతూ శుక్రవారం మధ్యాహ్నం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటింది. అనంతరం ఈ వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ జార్ఖండ్, ఉత్తర ఒడిశా వైపు వెళ్లనుంది. దీని ప్రభావం రాష్ట్రంపై దాదాపు తగ్గిపోయింది.
శనివారం రాత్రితో వర్షాలు తగ్గుముఖం పట్టే సూచనలున్నాయి. నేడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. నేడు, రేపు కోస్తా రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మత్స్యకారులకు హెచ్చరిక
తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం అలజడిగా ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తీరాల్లో 2.9 నుంచి 3.6 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదు. అత్యవసర సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 1800 425 0101 ను సంప్రదించాలి.

వర్షపాతం తీరిది
24 గంటల వ్యవధిలో (గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు) ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం నవగంలో 6.6 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం కరిముక్కిపుట్టిలో, పార్వతీపురం మన్యం జిల్లా గొయిడిలో 5.8, అల్లూరి జిల్లా చింతపల్లి మండలం అన్నవరంలో 4.6, శ్రీకాకుళం జిల్లా బుర్జ మండలం మదనపురంలో 4.4, అల్లూరి జిల్లా జి.మాడుగులలో 4.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది.