దేశమంతటా రుతుపవనాలు | Monsoon Covers Entire India: IMD | Sakshi
Sakshi News home page

దేశమంతటా రుతుపవనాలు

Jun 30 2025 4:00 AM | Updated on Jun 30 2025 4:00 AM

Monsoon Covers Entire India: IMD

గల్లంతైన వారి కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ గాలింపు దృశ్యం

ఈసారి ముందుగానే విస్తరించాయి: ఐఎండీ

న్యూఢిల్లీ: నైరుతీ రుతుపవనాలు ఈ సీజన్‌లో తొమ్మిది రోజులు ముందుగానే దేశమంతటా విస్తరించాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఆదివారం తెలిపింది. సాధారణంగా జూన్‌ ఒకటిన కేరళ మీదుగా దేశంలోకి ప్రవేశించే రుతుపవనాలు జూలై 8వ తేదీనాటికి దేశవ్యాప్తంగా విస్తరిస్తా యని పేర్కొంది. ఈసారి మాత్రం ముందుగానే ప్రవేశించడంతోపాటు విస్తరించాయంది. 2020లో జూన్‌ 26వ తేదీకల్లా దేశమంతటా రుతు పవనాల విస్తరణ పూర్తయిందని గుర్తు చేసింది. ఆదివారం దేశ రాజధాని ఢిల్లీతోపాటు రాజస్తాన్, పశ్చిమ యూపీ, హరియాణాల్లో వ్యాపించాయని వివరించింది.

వచ్చే వారం రోజుల్లో దేశంలోని వాయవ్య, మధ్య, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని స్పష్టం చేసింది. అరేబియా సముద్రం, బంగాళాఖాతం మీదుగా బలమైన అల్పపీడన వ్యవస్థల మద్దతుతో, రుతుపవనాలు వేగంగా ముందుకు సాగాయని తెలిపింది..అయితే, మే 29 నుంచి జూన్‌ 16 వరకు దాదాపు 18 రోజుల పాటు రుతు పవనాల కదలికలో స్తబ్దత ఏర్పడిందని పేర్కొంది. జూన్‌–సెప్టెంబర్‌ మధ్య ఈసారి సాధారణానికి మించి వర్షాలు కురిసే అవకాశాలున్నాయంది.

ఉత్తరాఖండ్‌లో కుంభవృష్టి..ఇద్దరు మృతి
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో ఆదివారం ఉదయం కురిసిన కుంభవృష్టి నిర్మాణ కార్మికులిద్దర్ని బలి తీసుకుంది. మరో ఏడుగురు గల్లంతయ్యారు. యమునోత్రి జాతీయ రహదారి పక్కన  ఓ హోటల్‌ నిర్మాణం పక్కనే కార్మికులు తాత్కాలిక నివాసాల్లో ఉంటున్నారు. భారీ వర్షంతో కొండచరియలు విరిగి ఈ నివాసాలపై పడ్డాయి. ఈ ఘటనలో ఘటనలో ఇద్దరు చనిపోయారు.

గల్లంతైన వారి కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు గాలింపు చేపట్టాయి. హైవే దెబ్బతినడంతో ఛార్‌ ధామ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ కుంభవృష్టి కారణంగా సిమ్లా–కల్కా రైలు మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. జార్ఖండ్‌లోని ఈస్ట్‌ సింగ్‌భుమ్‌ జిల్లాలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. పండర్‌సోలిలోని ప్రైవేటు స్కూల్‌ ఆవరణలోకి వరద చేరడంతో లోపల కనీసం 162 మంది విద్యార్థులు చిక్కుబడిపోయారు. 

Advertisement
 
Advertisement
Advertisement