విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పలు రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తం
న్యూఢిల్లీ/సిమ్లా/రాంపూర్: ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు తీవ్రస్థాయిలో ప్రభావం చూపడం మొదలెట్టాయి. దీంతో గురువారం సైతం ఢిల్లీ, హరియాణా, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌సహా పశ్చిమ, ఉత్తరభారతంలోని పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడ్డాయి. ఎడతెరిపిలేని వానలతో వర్షప్రభావిత జిల్లాల్లో రోడ్డు జలమయం కావడం, చెట్లు, ఇళ్లు కూలడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది.
కూలిన చెట్లు రహదారులపై పడటంతో చాలా చోట్ల వాహనాల రాకపోకలకు సైతం ఇబ్బందులు తప్పలేదు. మహారాష్ట్రలోని పింప్రీ ఛించ్వాడ్ జిల్లాలో వ్యర్థాల నుంచి ఇంధన తయారీ యూనిట్‌ను ఆనుకుని ఉన్న మూడంతస్తుల భవంతిపై భారీ చెత్తకుప్ప కూలడంతో గల్లంతైన వారి కోసం గురువారం సైతం అన్వేషణ, సహాయక చర్యలు కొనసాగాయి. గురువారం భవన శిథిలాల నుంచి ఒక మృతదేహాన్ని బయటకు తీశారు.
ఇంకా 8 మంది జాడ తెలియాల్సి ఉంది. భారీ వర్షాలతో ఢిల్లీ–నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రాఫిక్ స్తంభించింది. గురుగ్రామ్‌లోని ఒక లగ్జరీ రెసిడెన్షియల్ సొసైటీలో వర్షానికి భవనం బాగా నానిపోయి ఒక ప్లాట్ బాల్కనీ అమాంతం కుప్పకూలింది. ఢిల్లీలో వరదనీటి పైపుల నుంచి 57,000 మెట్రిక్ టన్నుల పూడిక తీశామని అధికారులు తెలిపారు. నోయిడా, ఘాజియాబాద్, ఘజీపూర్, ఫరీదాబాద్‌లలో జనావాసాల్లో వర్షపునీరు నిలిచిపోయింది. రాజస్థాన్‌లోని ఛిత్తోర్‌గఢ్, భరత్‌పూర్ జిల్లాలో భారీవర్షం కురిసింది. ఉత్తరాఖండ్‌లో వర్షాల దెబ్బకు 9 రాష్ట్ర రహదారులుసహా 107 రూట్లలో ట్రాఫిక్ స్తంభించి జనజీవనం తలకిందులైంది.
దీంతో డెహ్రాడూన్ జిల్లాయంత్రాంగం విద్యాసంస్థలకు శుక్రవారం సెలవు ప్రకటించింది. రాజస్థాన్, హరియాణా, పంజాబ్‌లోని చివరి ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించాయని, దీంతో యావత్ భారతదేశంలో వర్షాకాల సీజన్ మొదలైందని భారతవాతావరణ శాఖ గురువారం ప్రకటించింది. గరిష్టంగా 20 సెంటీమీటర్ల స్థాయిలో వర్షపాతం నమోదయ్యే ఆస్కారముందంటూ వాతావరణశాఖ కేరళలోని మళప్పురం, కోజికోఢ్, వయనాడ్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కినౌక్‌లో నది ఉప్పొంగి ప్రవహిస్తూ 100 అడుగుల ఇనుపవంతెనను తనలో కలిపేసుకుంది. కుపా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో మూడు ఇళ్లు కూలిపోయాయి. పడిన బండరాళ్లతో రోడ్డు మూసుకుపోయింది.


