breaking news
Delhi-Noida
-
పశ్చిమ, ఉత్తర భారతాల్లో దంచికొడుతూ..
న్యూఢిల్లీ/సిమ్లా/రాంపూర్: ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు తీవ్రస్థాయిలో ప్రభావం చూపడం మొదలెట్టాయి. దీంతో గురువారం సైతం ఢిల్లీ, హరియాణా, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌సహా పశ్చిమ, ఉత్తరభారతంలోని పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడ్డాయి. ఎడతెరిపిలేని వానలతో వర్షప్రభావిత జిల్లాల్లో రోడ్డు జలమయం కావడం, చెట్లు, ఇళ్లు కూలడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. కూలిన చెట్లు రహదారులపై పడటంతో చాలా చోట్ల వాహనాల రాకపోకలకు సైతం ఇబ్బందులు తప్పలేదు. మహారాష్ట్రలోని పింప్రీ ఛించ్వాడ్ జిల్లాలో వ్యర్థాల నుంచి ఇంధన తయారీ యూనిట్‌ను ఆనుకుని ఉన్న మూడంతస్తుల భవంతిపై భారీ చెత్తకుప్ప కూలడంతో గల్లంతైన వారి కోసం గురువారం సైతం అన్వేషణ, సహాయక చర్యలు కొనసాగాయి. గురువారం భవన శిథిలాల నుంచి ఒక మృతదేహాన్ని బయటకు తీశారు. ఇంకా 8 మంది జాడ తెలియాల్సి ఉంది. భారీ వర్షాలతో ఢిల్లీ–నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రాఫిక్ స్తంభించింది. గురుగ్రామ్‌లోని ఒక లగ్జరీ రెసిడెన్షియల్ సొసైటీలో వర్షానికి భవనం బాగా నానిపోయి ఒక ప్లాట్ బాల్కనీ అమాంతం కుప్పకూలింది. ఢిల్లీలో వరదనీటి పైపుల నుంచి 57,000 మెట్రిక్ టన్నుల పూడిక తీశామని అధికారులు తెలిపారు. నోయిడా, ఘాజియాబాద్, ఘజీపూర్, ఫరీదాబాద్‌లలో జనావాసాల్లో వర్షపునీరు నిలిచిపోయింది. రాజస్థాన్‌లోని ఛిత్తోర్‌గఢ్, భరత్పూర్ జిల్లాలో భారీవర్షం కురిసింది. ఉత్తరాఖండ్‌లో వర్షాల దెబ్బకు 9 రాష్ట్ర రహదారులుసహా 107 రూట్లలో ట్రాఫిక్ స్తంభించి జనజీవనం తలకిందులైంది. దీంతో డెహ్రాడూన్ జిల్లాయంత్రాంగం విద్యాసంస్థలకు శుక్రవారం సెలవు ప్రకటించింది. రాజస్థాన్, హరియాణా, పంజాబ్‌లోని చివరి ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించాయని, దీంతో యావత్ భారతదేశంలో వర్షాకాల సీజన్ మొదలైందని భారతవాతావరణ శాఖ గురువారం ప్రకటించింది. గరిష్టంగా 20 సెంటీమీటర్ల స్థాయిలో వర్షపాతం నమోదయ్యే ఆస్కారముందంటూ వాతావరణశాఖ కేరళలోని మళప్పురం, కోజికోఢ్, వయనాడ్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కినౌక్లో నది ఉప్పొంగి ప్రవహిస్తూ 100 అడుగుల ఇనుపవంతెనను తనలో కలిపేసుకుంది. కుపా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో మూడు ఇళ్లు కూలిపోయాయి. పడిన బండరాళ్లతో రోడ్డు మూసుకుపోయింది. -
ఒంటరి అమ్మ బతుకు పోరు
27 ఏళ్ల చంచల్ శర్మ ఝాన్సీ లక్ష్మీబాయిని గుర్తుకు తెస్తోంది. ఝాన్సీ తన బిడ్డను కట్టుకుని శత్రువుతో యుద్ధం చేస్తే చంచల్ తన బిడ్డను కట్టుకుని బతుకుపోరు చేస్తోంది. గర్భంతో ఉండగా భర్త నుంచి విడిపోయిన చంచల్ బిడ్డ పుట్టాక ఏడుస్తూ కూచోలేదు. బతకాలని బిడ్డను బతికించుకోవాలని సంకల్పించింది. ఆమె కథ ఇప్పడు నెట్లో వైరల్‌గా మారింది. ఢిల్లీ– నోయిడాలో చంచల్ శర్మ నడిపే ఈ ఆటో రిక్షా అందరికీ తెలుసు. దాని డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉండే ఆమెను అందరూ మెచ్చుకోలుగా చూస్తూ ఉంటారు. ఆశ్చర్యంగా చూస్తు ఉంటారు. గౌరవంగా చూస్తూ ఉంటారు. దాని కారణం ‘కంగారు’లాగా ఆమె కూడా తన ఒక సంవత్సరం కొడుకును పొట్టకు దగ్గరగా కట్టుకుని డ్రైవింగ్ చేస్తూ ఉండటమే. పల్లెల్లో బిడ్డను నడుముకు కట్టుకుని కూలి పనులు చేసే తల్లులు మనకు కొత్త కాదు. కాని ఒక ఆటో రిక్షా నడుపుతూ ఇలా నగరంలో ఒక ఒంటరి తల్లి తన బతుకు కోసం సంఘర్షించడం మాత్రం కొత్త. ఇటీవల ఈమె గురించి మీడియాలో వస్తే సోషల్ మీడియాలో చాలా మంది మాట్లాడారు. మెచ్చుకున్నారు. ఎందుకు? జీవితం సవాలు విసిరినప్పుడు చేతనైన జవాబు చెప్పాలని చంచల్ అనుకోవడమే. భర్త నుంచి విడిపోయి... 27 ఏళ్ల చంచల్ శర్మ పెళ్లయ్యి గర్భం వచ్చాక భర్త నుంచి విడిపోవాల్సి వచ్చింది. ఆమెకు తల్లి తప్ప ఎవరూ లేరు. బతుకు తెరువు లేదు. బిడ్డకు జన్మనిచ్చాక ఒకవైపు భర్త తోడు లేకపోవడం, మరోవైపు బిడ్డ బాధ్యత ఆమెను సతమతం చేశాయి. జీవితంలో ఓడిపోవడమా? పోరాడి నిలవడమా? రెండో మార్గమే ఎంచుకుంది. కొడుకు నెలల బిడ్డగా ఉండగా తల్లి దగ్గరే వదిలి ఈ ఆటో రిక్షా నడపడం మొదలెట్టింది. కాని ఇప్పుడు వాడికి సంవత్సరం నిండింది. తల్లి కోసం బెంగటిల్లుతుంటాడు. అదీగాక తల్లి ఆ పిల్లాణ్ణి చూసుకోలేకపోతోంది. క్రష్‌లో వేద్దామంటే అందుకు కట్టాల్సినంత డబ్బు తన వద్ద లేదు. పైగా క్రష్‌లు కూడా బాగా చార్జ్ చేస్తున్నాయి ఢిల్లీలో. అందుకే తనతోపాటే కొడుకును నడుముకు కట్టుకుని డ్యూటీ చేయాలని నిశ్చయించుకుంది చంచల్ శర్మ. 600 సంపాదన... ఉదయం ఆరున్నరకు కొడుకుతో పాటు డ్యూటీ ఎక్కుతుంది చంచల్ శర్మ. మధ్యాహ్నం వరకూ ఆటో నడిపి ఇల్లు చేరుతుంది. కొడుక్కు స్నానం చేయించి, తినిపించుకుని, కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ డ్యూటీ ఎక్కుతుంది కొడుకుతో. రాత్రి ఎనిమిది వరకూ పని చేస్తుంది. మధ్యలో కొడుకు ఆకలికి ఒక పాల సీసా పెట్టుకుంటుంది. ఇంత శ్రమ చేస్తే ఆమెకు రోజుకు 600 మిగులుతున్నాయి. ఒక్కోసారి కొడుకు పొట్ట మీద నిద్రపోతాడు. ఒక్కోసారి మేలుకుని హుషారుగా ఉంటాడు. ఒక్కోసారి మాత్రం ఏడుస్తూనే ఉంటాడు. కాని పాసింజర్లు విసుక్కోరు. ఆమెను సానుభూతితో అర్థం చేసుకుంటారు. మహిళా పాసింజర్లయితే ఈమె ఆటోనే వెతికి ఎక్కుతారు.. సాయం చేసినట్టు ఉంటుందని. ఎండాకాలం వస్తే మాత్రం బిడ్డను తీసుకుని తిరగడం కష్టం అంటుంది చంచల్. ఆ టైమ్‌లో తల్లి మీద ఆధారపడాల్సి వస్తుంది అంటుంది. ‘నా బిడ్డ కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అంటుంది చంచల్ శర్మ. ఒంటరి స్త్రీ... సింగిల్ మదర్‌గా జీవించడంలో బెంబేలెత్తాల్సిన పని లేదు. సమాజంలో ఇప్పుడు సింగిల్ మదర్‌కు అండ దొరుకుతుంది. వారు కష్టపడి పని చేయాలనుకుంటే సాయం చేసే వారూ ఉన్నారు. కావలసిందల్లా ఎదురొడ్డే తెగువే. చంచల్ శర్మను చూసి చాలా మంది స్ఫూర్తి పొందుతున్నారు. -
ప్రయాణం ఇంకా హాయిగా
న్యూఢిల్లీ: ఢిల్లీ-నోయిడాలమధ్య రాకపోకలు సాగించేవారికి శుభవార్త. షహదారా మురుగుకాల్వపై ప్రస్తుతమున్న నాలుగు లేన్ల రహదారి త్వరలో ఎనిమిది లేన్లు కానుంది. ఇందుకు సంబంధించి ఢిల్లీ వరద నియంత్రణ విభాగం, నోయిడా సంస్థల మధ్య త్వరలో ఓ ఒప్పందం కుదరనుంది. ఈ విషయాన్ని నోయిడా చీఫ్ ప్రాజెక్టు ఇంజనీర్ ఎ.కె.గోయల్ వెల్లడించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ ప్రభుత్వం, తాము కలసి ఇందుకు నిధులను కేటాయిస్తామన్నారు. తాము 33 శాతం నిధులను విడుదల చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టు పనులకు రూ. 50 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశామన్నారు. ఈ మార్గంలో కొత్తగా మూడు వంతెనల విస్తరించనున్నామన్నారు. ఇందుకు రూ. 15 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశామన్నారు. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తామన్నారు. ఓఖ్లా వంతెన వద్ద విస్తరణ పనులు ఏడాదిన్నర తర్వాత ప్రారంభమయ్యే అవకాశముందన్నారు. ఈ మార్గంలో వాహనాల రద్దీ పెరిగిపోయిందని, వంతెనల విస్తరణ పనులు పూర్తయితే ఈ మార్గంలో రాకపోకలు సాగించేవారికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. వాహనాల రద్దీ పెరగడాన్ని పరిగణనలోకి తీసుకునే ఈ ప్రాజెక్టుకు ప్రణాళికలను రూపొందించామన్నారు. కాగా ఢిల్లీలోని చిల్లా రెగ్యులేటర్ వద్ద ప్రారంభమయ్యే షహదారా డ్రెయిన్ నోయిడాలోని సెక్టార్ 14 ఏ వద్ద ముగుస్తుంది.


