తడవని మడి.. కంటతడి | Southwest monsoon delayed due to El Nino effect farmers worry on it | Sakshi
Sakshi News home page

తడవని మడి.. కంటతడి

Jun 30 2026 5:28 AM | Updated on Jun 30 2026 5:28 AM

Southwest monsoon delayed due to El Nino effect farmers worry on it

వర్షం కోసం వేయికళ్లతో రైతన్న ఎదురుచూపులు 

ఎల్‌నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు ఆలస్యం 

పలు జిల్లాల్లో లోటు వర్షపాతం.. 

రాష్ట్రంలో 302 మండలాల్లో కరువు పరిస్థితులు.. 

మొత్తం 485 మండలాల్లో సాధారణం నుంచి భారీ లోటు 

కృష్ణా, గోదావరి బేసిన్‌ ప్రాజెక్టుల వైపు రైతుల చూపు

తొలకరి పలకరించడంతో పత్తి విత్తనాలు నాటుకున్న ఈ రైతు పేరు సుధాకర్‌. మెదక్‌ జిల్లా బద్యతండాకు చెందిన ఈయన  పది వేల రూపాయలు ఖర్చు చేసి ఎకరంలో పత్తి విత్తనాలు విత్తాడు. వర్షాలు లేకపోవడంతో మొలకలు రావడం లేదు. దీంతో సుధాకర్, అతని కుటుంబ సభ్యులు బకెట్లతో ఇలా నీళ్లు పోసుకుంటున్నారు. కనీసం ఈ నీళ్లతోనైనా మొలకలు వస్తాయనే ఆశతో ఉన్నారు. 

జనగామ జిల్లా నర్మెట మండల కేంద్రానికి చెందిన రైతు మందరాజు మూడున్నర ఎకరాల్లో పత్తి సాగు చేశారు. వర్షాలు లేకపోవడంతో సబ్సిడీ కింద వచ్చిన డ్రిప్‌ పైపులను గట్టు వెంట నేల కింద నుంచి 25 పైపులను ఏర్పాటు చేసి, 500 మీటర్ల దూరంలోని బోరునుంచి ఏర్పాటు చేసి పత్తి విత్తులకు సాగునీరు అందిస్తున్నారు.  

ఈయన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం సముద్రాల గ్రామానికి చెందిన మేకల నరేశ్‌. తనకున్న పది ఎకరాల భూమిలో ఏటా వరి, మొక్కజొన్న, పత్తి పంటలు సాగు చేస్తాడు. ఈ సీజన్‌లో వర్షాలు లేక పోవడంతో 8 ఎకరాల్లో పత్తి, రెండు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. భూమిలో నీరు అడుగంటి పోగా గత ఏడాది వరకు రూ.5 లక్షల ఖర్చుతో 18 బోర్లు వేశాడు. అందులో ఒక్కటీ సక్సెస్‌ కాలేదు.  

ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆయకట్టు రైతులు ముమ్మరంగా బోర్ల తవ్వకాలు చేపట్టారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు నేటి వరకు నీటి వరద రాకపోవడంతో సాగునీటిపై రైతులకు ఆశలు సన్నగిల్లాయి. 20 ఏళ్ల నాటి కరువు ఛాయలు మళ్లీ అలుముకుంటుండటంతో రైతాంగం బోర్లు వైపు దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. చిలుకూరు, నారాయణపురం, రామాపురం, ఆర్లెగూడెం, పోలేనిగూడెం, బేతవోలు చుట్టుపక్కల గ్రామాలు రైతులు బావులవైపు మొగ్గుచూపుతున్నారు.    

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: తెలంగాణలో ఖరీఫ్‌ సీజన్‌కు అత్యంత కీలకమైన జూన్‌ మాసం నేటితో ముగుస్తుండటంతో రైతుల కళ్లన్నీ ఆకాశంపైనే ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు దాదాపు 15 రోజులు ఆలస్యంగా రాష్ట్రంలోకి ప్రవేశించడం, వచ్చిన తర్వాత కూడా వర్షాలు సరిగా కురవకపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది. మొత్తం 621 మండలాలకుగాను 485 మండలాల్లో సాధారణం నుంచి లోటు, భారీ లోటు ఉండగా, 86 మండలాల్లో భారీ, 216 మండలాల్లో లోటు, 183 మండలాల్లో సాధారణంగా నమోదైంది. ఉమ్మడి వరంగల్‌లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. హనుమకొండ జిల్లాలో 72 శాతంతో భారీ లోటు కాగా, వరంగల్‌ జిల్లాలో 57 శాతం, సిద్దిపేటలో 50శాతం లోటు ఉంది.  ఇప్పటికే తొల కరి వానలను నమ్ముకుని పత్తి, మొక్క జొన్న, కంది తదితర పంటలు వేసిన రైతులు ఇప్పు డు మొలకలను కాపాడుకోవడానికి ట్యాంకర్లతో నీరు పోయించడం, బిందెలతో మొక్క మొక్కకు నీళ్లు అందించడం వంటి అసాధారణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. 

భూగర్భజలాలపై చివరి ఆశ.. 
వానలు లేకపోవడంతో రైతులు భూగర్భజలాలపై ఆధారపడుతున్నారు. పాత బోర్లు ఎండిపోవడంతో కొత్త బోర్లు వేయిస్తున్నారు. వరంగల్‌ జిల్లాలో మే నెలలో సగటు భూగర్భజలమట్టం 6.27 మీటర్లు, హనుమకొండలో 6.17 మీటర్లు, జనగాంలో 7.78 మీటర్ల లోతులో నమోదైంది. మరింత వర్షం లేకపోతే భూగర్భజలాలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షాలపై నమ్మకం తగ్గడంతో కృష్ణా, గోదావరి బేసిన్‌ ప్రాజెక్టుల నుంచైనా సాగునీరు అందుతుందేమోనని రైతులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలోని 30 జిల్లాల్లో సీజన్‌ సాధారణంతో పోలిస్తే 25 శాతం లోపే సాగు జరిగింది. 

గోదావరి, కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులపై ఆశలు... 
ఇరిగేషన్‌ అధికారుల నివేదిక ప్రకారం వానాకాలం ప్రారంభమైనప్పటికీ ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు మిశ్రమంగా ఉన్నాయి. కృష్ణా బేసిన్‌లోని కీలక ప్రాజెక్టుల్లో చాలావరకు నిల్వలు తక్కువగా ఉండగా, గోదావరి బేసిన్‌లో కూడా పూర్తిస్థాయి నిల్వలు లేవు. అయితే గత ఏడాదితో పోలిస్తే మొత్తం ప్రధాన జలాశయాల్లో నిల్వలు మెరుగ్గా నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రధాన జలాశయాల్లో 402.40 టీఎంసీలు ఉన్నాయి. కృష్ణా బేసిన్‌ పరిధిలోని ప్రధాన ప్రాజెక్టులు అల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల తదితర ప్రాజెక్టుల కింద 90–95 లక్షల ఎకరాల స్థిరీకరణ ఆయకట్టు ఉంది. గోదావరి బేసిన్‌ సింగూరు, నిజాంసాగర్, శ్రీరాంసాగర్, మిడ్‌మానేరు, కడెం, శ్రీపాద ఎల్లంపల్లిల పరి«ధిలో 15.–18 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉంది. అయితే కృష్ణా బేసిన్‌లో శ్రీశైలం, జూరాల, తుంగభద్రలో నిల్వలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. నాగార్జునసాగర్‌లో మాత్రం గత ఏడాదికంటే నిల్వలు మెరుగ్గా నమోదయ్యాయి. గోదావరి బేసిన్‌లో శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, మానేరు ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి నిల్వలు లేకపోవడంతో ఖరీఫ్‌ సాగు చేసే రైతులు వర్షాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. 


జూలై 15 డెడ్‌లైన్‌.. 
వ్యవసాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం జూన్‌ 20 నుంచి జూలై 15 వరకు ప్రధాన ఖరీఫ్‌ విత్తనాల కాలం. ఆ తర్వాత విత్తితే... చీడపీడల ఉధృతి పెరిగే అవకాశం. పంట ఎదుగుదల దెబ్బతినడం, దిగుబడులు తగ్గిపోవడం, కోత ఆలస్యమై మార్కెట్‌పై ప్రభావం పడే అవకాశం ఉంటుందని వ్యవసాయశాఖ అధికారి ఆదిరెడ్డి తెలిపారు. దీంతో రైతులు కూడా తక్కువ కాలంలో పండే, తక్కువ నీటితో వచ్చే పంటలు, కరువును తట్టుకునే వంగడాలపై దృష్టి పెడుతున్నారు.

ఇప్పటికే కలుపు తీయాల్సింది.. 
నా ఐదు ఎకరాలతోపాటు 10 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నా.. ఇప్పటికే భారీ వర్షాలు కురిసి విత్తనాలు వేసుకుంటే కలుపునకు దౌరలు కొట్టి, ఎరువులు వేయాల్సింది. నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షంతో విత్తనం వేసుకుంటున్నా. ఈ ఏడాది వానలు ఉండవని అంటున్నారు. కౌలు ముందే చెల్లించినా వానలు పడకుంటే నష్టపోవుడే. 
– పుప్పాల నాగేశ్, రైతు, నెన్నెల, మంచిర్యాల జిల్లా

నారు పోసి చూస్తున్న.. వానలు లేవు 
వానాకాలం ప్రారంభమై నెల రోజులైనా సరైన వర్షాలు లేక పంటలు వేయలేని పరిస్థితి. వరి నాట్లు వేద్దామని నారుపోసి నెలరోజులు గడుస్తున్నా వర్షం జాడలేదు. ఇప్పటివరకు ఖరీఫ్‌ సీజన్‌కు తగినంత వర్షాలు లేకపోవడంతో వర్షాల కోసం ఎదురుచూస్తున్నాం. పత్తి విత్తనాలు పెట్టే సమయం కూడా దగ్గర పడుతుంది. బావులు, బోర్లు ఉన్న రైతులు పత్తి పంట వేసిన వాటికి సరిపడా నీటి తడి అందక మొలకెత్తే పరిస్థితి లేకుండాపోయింది.
– ఈడబోయిన సారయ్య, రైతు, పీచర, హనుమకొండ జిల్లా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement