
రాష్ట్రంపై వాయుగుండం, ఆవర్తనం ప్రభావం
ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, రాష్ట్రం మొత్తానికి ఎల్లో అలర్ట్
శుక్రవారం రాష్ట్రంలో అనేక చోట్ల భారీ వర్షాలు నమోదు
హైదరాబాద్, రంగారెడ్డి చుట్టుపక్కలే అధికంగా వర్షం
సాక్షి, హైదరాబాద్: తీవ్ర వర్షాభావ పరిస్థితుల నుంచి రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించింది. శుక్రవారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రానున్న మూడు రోజులు కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు సైతం నమోదు కావొచ్చని అంచనా వేసింది. బికనీర్, సికార్, వాయువ్య మధ్యప్రదేశ్ నుంచి నైరుతి ఉత్తరప్రదేశ్ వరకు వాయుగుండం కొనసాగుతోంది.
ఇది క్రమంగా తూర్పు ఆగ్నేయ దిశలో కదిలి ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించనుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీనికి సమాంతరంగా ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
మధ్య తెలంగాణలో భారీ వర్షం..: శుక్రవారం రాష్ట్రంలో అనేక చోట్ల వర్షాలు కురిశా యి. ప్రధానంగా మధ్య తెలంగాణలో భారీ వర్షాలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 50 చోట్ల 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసింది. రా ష్ట్రంలో వరుసగా మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శనివారం ఉదయం వరకు రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, సిద్దిపేట, భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచి్చంది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
జీహెచ్‌ఎంసీ సమీప జిల్లాల్లో భారీ వర్షం
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో శుక్రవారం భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల చక్రవాత ఆవర్తనం, దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులు వర్షాలకు అనుకూలంగా మారాయి. దీంతో మూడు రోజుల పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్‌లోని కొన్ని ప్రాంతాలు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో వచ్చే మూడు రోజులకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేశాం. – డాక్టర్ కే.నాగరత్న డైరెక్టర్, ఐఎండీ–హైదరాబాద్