
తాళ్లపూడి, లింగపాలెంలో 8.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
సాక్షి, అమరావతి/బుట్టాయగూడెం: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తుండగా.. రాయలసీమలో తేలికపాటి జల్లులు పడుతున్నాయి. శనివారం తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి, ఏలూరు జిల్లా లింగపాలెంలో 8.7 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లా పెదకాకానిలో 7.7, పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో 7.5, గుంటూరు జిల్లా వల్లభపురంలో 7.4, గుంటూరులో 7.2, ఏలూరు జిల్లా నూజివీడులో 7.1, కృష్ణా జిల్లా తోట్లవల్లూరు, కౌతవరంలో 7, ప్రకాశం జిల్లా దర్శిలో 6.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
47 ప్రాంతాల్లో 4 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కాగా, ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో బైనేరు, కొవ్వాడ, చింతకొండ, జల్లేరు, కొండ వాగులు పొంగిపొర్లుతున్నాయి. కేఆర్ పురం సమీపంలోని కొండవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పోలవరం నుంచి కన్నాపురం మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
నేడు మోస్తరు వానలు..
అల్పపీడనం 48 గంటల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా ఛత్తీస్‌గఢ్, విదర్భ మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆదివారం శ్రీకాకుళం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది.