
అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావం
శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో అతి భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే ఉపరితల ఆవర్తనం నుంచి మరొక ద్రోణి విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో అనేకచోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. మంగళవారం శ్రీకాకుళం జిల్లా గరికిపాలెంలో 8.4 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అదే జిల్లా ఎచ్చెర్లలో 7.9, అనకాపల్లి జిల్లా చీడికాడలో 7, వేచలంలో 6.4, విజయనగరం జిల్లా మెరకముడిదంలో 5.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
శుక్ర, శనివారాల్లో అతి భారీ వర్షాలు
కోస్తాలో శుక్ర, శనివారాల్లో పలుచోట్ల అతిభారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీవర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పిడుగులతో కూడిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గురువారం నుంచి ఆదివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. బుధవారం, గురువారాల్లో ఓ మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.