
మరోవైపు ఈశాన్య అరేబియన్ సముద్రంలోనూ అల్పపీడనం ఏర్పడే అవకాశం
దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మూడురోజుల పాటు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: ఉత్తర బంగాళాఖాతం, దానికి సమీపంలోని మధ్య బంగాళాఖాతంలో అక్టోబర్ 1వ తేదీన ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మంగళవారం నాటికి అదే ప్రాంతంలో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడుతుందని, ఆ తర్వాత ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ వివరించింది.
ఉత్తర, మధ్య మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్, సౌరాష్ట్ర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని, మంగళవారం నాటికి ఈశాన్యం అరేబియన్ సముద్ర ప్రాంతంలో మరో అల్పపీడనంగా ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి ఒకటి పశి్చమ విదర్భ, దాని సమీపంలోని మధ్య మహారాష్ట్ర ప్రాంతంలోని అల్పపీడన కేంద్రం నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఉత్తర కోస్తా ఆంధ్రా నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోందని, ఇది సముద్ర మట్టం నుంచి సగటున 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉందని వివరించింది.
దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వివరించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.
రెండ్రోజుల్లో ముగియనున్న నైరుతి సీజన్
నైరుతి రుతు పవనాల సీజన్ మరో రెండు రోజుల్లో ముగియనుంది. జూన్1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకున్న మధ్య కాలాన్ని నైరుతి రుతు పవనాల సీజన్‌గా పరిగణిస్తారు. ప్రస్తుతం నైరుతి రుతు పవనాల ఉపసంహరణ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటికే పలు ఉత్తరాది రాష్ట్రాల నుంచి నైరుతి రుతు పవనాల ఉపసంహరణ పూర్తి కాగా, వచ్చేనెల రెండో వారం చివరి నాటికి భారత భూభాగం నుంచి పూర్తిగా తిరోగమిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈసారి నైరుతి రుతు పవనాల సీజన్‌లో వర్షాలు సమృద్ధిగా కురిశాయి.
తొలి అర్ధభాగం తీవ్ర వర్షాభావ పరిస్థితులు నమోదైనా, ఆ తర్వాత రుతు పవనాల కదలికలు అత్యంత చురుగ్గా ఉండడంతో వానలు జోరందుకున్నాయి. నైరుతి సీజన్‌లో రాష్ట్రంలో సగటున 74.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటికే 98.48 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే దాదాపు 35 శాతం అధిక వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజుల్లో రాష్ట్రంలో కురిసే వర్షాలతో సీజన్ వర్షపాతం 100 సెంటీమీటర్లు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ సీజన్‌లో రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, 18 జిల్లాల్లో అధిక వర్షపాతం, ఏడు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా పరిశీలిస్తే... 147 మండలాల్లో అత్యధిక వర్షపాతం, 291 మండలాల్లో అధిక వర్షపాతం, 181 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 2 మండలాల్లో లోటు వర్షపాతం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.