సాక్షి, మెదక్: మైక్రో ఫైనాన్స్ ఏజెంట్ల వేధింపులకు మరో మహిళ ప్రాణాన్ని బలితీసుకున్న ఘటన తూప్రాన్‌లో చోటుచేసుకుంది. తన ఇంటి నిర్మాణం కోసం పలువురు ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల నుంచి రుణాలు తీసుకున్న ఓ యువతి తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.
సమాచార ప్రకారం.. వరలక్ష్మి అనే యువతి మేడ్చల్‌లోని ఫైవ్ స్టార్ మైక్రో ఫైనాన్స్ నుండి 4 లక్షల రుణం తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు వడ్డీతో సహా 8 లక్షలకు పైగా చెల్లించినప్పటికీ ఇంకా తమకు బకాయి కట్టాల్సి ఉందని ఏజెంట్లు రోజూ ఇంటికి వచ్చి బాధితురాలిని వేధిస్తున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
అదేవిధంగా తూప్రాన్‌లోని క్రిష్ మైక్రో ఫైనాన్స్ బ్యాంక్ నుండి తీసుకున్న 70 వేల రుణంలో ఇంకా 20 వేల రూపాయలు బకాయి ఉన్నాయని దీనికిగాను ఏజెంట్లు తరచూ రావడం వల్ల కుటుంబం తీవ్ర ఒత్తిడికి గురైందని సమాచారం.
ఇక ఈ నేపద్యంలో ఈరోజు ఉదయం కూడా లోన్ రికవరీ ఏజెంట్లు వరలక్ష్మి ఇంటికి వచ్చి ఆమెతో దురుసుగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. దాంతో మానసికంగా తీవ్రంగా కుంగిపోయిన వరలక్ష్మి కొద్ది సేపటికే సమీపంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది.
బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో సమాచారం అందుకున్న తూప్రాన్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వరలక్ష్మిని వేధించిన రికవరీ ఏజెంట్లపై కుటుంబ సభ్యులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


