జగిత్యాల : తమ ముఖ్యమంత్రి అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకోవడం లేదంటూ పార్టీ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కేవలం పార్టీ ఫిరాయింపు వారికే గుర్తింపు ఇస్తున్నారని చురకలు అంటించారు. జగిత్యాల జిల్లా నూతన డీసీసీ అధ్యక్షుడు నందయ్యకు తన ఇంట్లో సన్మాన కార్యక్రమానికి హాజరైన జీవన్‌రెడ్డి.. ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై మండిపడ్డారు. ‘లక్ష్మణ్ అన్నకు కోపం వచ్చినా సరే… కానీ, మా పోటీ పక్కవాళ్లతో కాదు.. ముఖ్యమంత్రి స్థాయి నాయకులతోనే. కాంగ్రెస్ కన్నతల్లి లాంటి పార్టీ. తన బిడ్డలను కాపాడుకుంటుంది. కానీ మా లాంటి వాళ్లను సీఎం రేవంత్ పట్టించుకోవడం లేదు.
అసలైన కాంగ్రెస్‌కు కార్యకర్తలను వదిలేస్తున్నారు.. ఫిరాయింపు వారికి గుర్తింపు ఇస్తున్నారు. జగిత్యాలకు ఎమ్మెల్యే సంజయ్ చేసేందేమీ లేదు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి సంజయ్ ఏం చేశారు?’ అని ధ్వజమెత్తారు.


