హిమాచల్‌లో వర్షాలతో నష్టం | Rains play havoc in Himachal Uttarakhand 45 killed several missing | Sakshi
Sakshi News home page

హిమాచల్‌లో వర్షాలతో నష్టం

Jul 5 2025 5:22 AM | Updated on Jul 5 2025 5:22 AM

Rains play havoc in Himachal Uttarakhand 45 killed several missing

రెండు వారాల్లో 43 మంది మృతి

ఉత్తరాఖండ్‌లో ఇద్దరు ఐఏఎఫ్‌ సిబ్బంది మృతి

న్యూఢిల్లీ: గడిచిన రెండు వారాలుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో హిమాచల్‌ ప్రదేశ్‌లో తీవ్ర నష్టం సంభవించింది. వర్షాలకు సంబంధించిన ఘటనల్లో 43 మంది మృతి చెందగా 37 మంది కనిపించకుండా పోయారు. ఒక్క మండి జిల్లాలోనే 17 మంది చనిపోగా, 31 మంది గల్లంతయ్యారు. జూన్‌ 20వ తేదీ నుంచి హిమాచల్‌లో కురుస్తున్న వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల కారణంగా రాష్ట్రంలో రూ.5 వేల కోట్ల మేర నష్టం వాటిల్లింది. 

వచ్చే మంగళవారం వరకు వర్షాల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్‌లోని భిమ్‌టల్‌లో గురువారం ఉప్పొంగుతున్న జలాశయంలో మునిగి నేవీకి చెందిన ఇద్దరు సిబ్బంది చనిపోయారు. పఠాన్‌ కోట్‌కు చెందిన ప్రిన్స్‌ యాదవ్‌(22), బిహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన సాహిల్‌ కుమార్‌(23)గా వీరిని గుర్తించారు. నైనిటాల్‌ నుంచి సరదాగా గడిపేందుకు వచ్చిన 8 మంది ఐఏఎఫ్‌ సిబ్బందిలో వీరున్నారు. 

వర్షాల కారణంగా రాష్ట్రంలోని 100కు పైగా రహదారులను మూసివేశారు. చార్‌ధామ్‌ యాత్రకు అంతరాయం కలిగింది. యమునోత్రికి వెళ్లే జాతీయ రహదారిపై ఐదు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియలు విరిగిపడి ఈ రహదారిపైనున్న సిలాయి మలుపు వద్ద 12 మీటర్ల రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో, 9 మంది నిర్మాణ కార్మికులు కొట్టుకుపోయారు. వీరి కోసం గాలింపు కొనసాగుతోంది. 

మరోవైపు, ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నీటిని బయటకు పంపేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. మండ్లా, సియోని, బాలాఘాట్‌ జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించింది. జబల్పూర్‌–మండ్లా జిల్లాలను కలిపే జాతీయ రహదారిపై కొండచరియలు విరిగి పడటంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. అదేవిధంగా, రాజస్తాన్‌లోని జైసల్మీర్‌ జిల్లా పొఖ్రాన్‌లో 128 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలోనూ భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement